పుట:Tikkana-Somayaji.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యధ్యాయము

15


ద్రావిడదేశమున వ్యవహరింపఁ బడుచుండెను. తిరుక్కాళత్తి శబ్దమె తెలుఁగులో తిక్కన యని వ్యవహరింపఁ బడుచున్నది. కావున, తిక్కన యనునది శ్రీకాళహస్తి దేవుని నామమే గాని మఱి యన్యము గాదు. పరాక్రమవంతుఁ డైన తిక్కభూపతి తెలుఁగుచోడులలో సుప్రసిద్ధుఁడు. ఇతఁ డసహాయశూరుఁడై బాల్యముననే యుద్ధములను జేసి విజయములను బొందుచు వచ్చె ననుటకు దృష్టాంతములు గలవు. ఇతఁడు శైశవము నందే వెలనాటి ప్రభువైన పృథ్వీశ్వర మహారాజుతో యుద్ధముచేసి రణరంగమున వానిమస్తకమును ద్రుంచి దానితోఁగందుక క్రీడ గావించి నాఁ డని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణమున,

"ఉ. కేశవసన్నిభుండు పరిగీతయశోనికి చోళతిక్కధా
     త్రీశుఁడు కేవలుండె, నృపు లెవ్వరి కాచరితంబు గల్గునే,
     శైశవలీల నాఁడు పటుశౌర్యధురంధరబాహుఁ డైన పృ
     థ్వీశనరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుక కేళి సల్పఁడే"

అను పద్యములో నభివర్ణించి యున్నాఁడు. ఈషృథ్వీశ నరేంద్రుఁడు మనుమ గొంకరాజునకు జయాంబికయం దుద్భవించి రాజరాజ చాళుక్యచోళ చక్రవర్తికిఁ బ్రతినిధి యయు సర్వస్వతంత్రుఁడై వేంగీదేశమును బరిపాలించు చుండెను. కాఁబట్టి పృథ్వీశ్వర రాజు పండ్రెండవ శతాబ్ద్యంతమున నుండె ననుటకు సందేహము లేదు. తనతండ్రి మనుమసిద్దిరాజునకుఁ బిమ్మట తిక్కరాజు విక్రమసింహపురమునఁ బట్టాభిషిక్తుడై