పుట:Tikkana-Somayaji.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
10
తిక్కన సోమయాజి


ఈసందర్భమునఁ దెలుఁగు చోడరాజుల చరిత్రమును జదువరు లెఱింగి యుండుట యత్యావశ్యకము గావునఁ బాఠకుల యుపయోగార్థము సంగ్రహముగా నిటఁ దెలుపుచున్నాఁడను.

తెలుఁగు చోడరాజులు సూర్యవంశపురాజు లైనట్లుగా నాంధ్రకవుల కావ్యముల యం దభివర్ణింపఁబడి యున్నారు విష్ణునాభికమలమున బ్రహ్మయు, వానికిఁ మరీచియు, వానికి గశ్యపుఁడును, వానికి సూర్యుఁడును, బుట్టిరఁట. [1]అట్టి సూర్యుని వంశమునఁ గరికాలచోడఁడు జనించి చోడరాజకుటుంబముల కెల్లను మూలపురుషుఁడై యొప్పెను. ఇతనితండ్రి జటచోడు డనియును, ఇతఁ డయోధ్యను బాలించె ననియును, ఇతఁడు కావేరినది కానకట్టకట్టించి గట్లుపోయించె ననియు, తెలుఁగు చోడుల శాసనములలో నభినర్ణింపఁ బడియుండెను. ఇతఁడు త్రిలోచనపల్లవుని జయించెననియును, కావేరినది కానకట్టకట్టిం చెననియు, తిక్కన సోమయాజి గూడ వర్ణించి యున్నాడు.[2]

 1. "ఉ. అంబుజనాభునాభి నుదయంబయి వేధ మరీచిఁ గాంచెలో
       కంబుల కెల్లఁ బూజ్యుఁ డగు కశ్యపుఁ డాతనికి౯ జనించె,వి
       శ్వంబు వెలుంగఁ జేయఁగ దివాకరుఁ డమ్ముని కుద్బవించె వా
       నింబొగడం జతుశ్శ్రుతులు నేరక యున్నవి నాకు శక్యమే."
                                        (తిక్కననిర్వచనోత్తర రామాయణము)

 2. "శా. చేసేతం బృథివీశు లందుకొనఁ గాశీసింధుతో యంబుల౯
       జేసెన్ మజ్జన ముంగుటంబున హరించెం బల్లవోర్వీశును
       ల్లాసం బొందఁగ, ఫాలలోచనము లీలం గట్టెఁ గానేరి, హే
       లాసాధ్యాఖిల దిఙ్ముఖుండుకరికాల క్ష్మావిభుం డల్పుఁడే!?"
                                              (నిర్వచనోత్తర రామాయణము)