పుట:Tikkana-Somayaji.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

తిక్కన సోమయాజి


లోని పద్యమును మార్పు చేయకయె విరాటపర్వములో నాలవయాశ్వాసములోఁ బ్రయోగించి యున్నాడు.

నిర్వచనోత్తర రామాయణములో నాఱవయాశ్వాసమున దేవదానవ యుద్ధసందర్భమున రచియింపఁబడిన

"మ. పటువేగంబున శాతభల్ల చయసంపాతంబున౯ మింట మి
     క్కుటమై పర్వ ధగద్దగీయ మగుచుం గోపంబు రూపంబు లై
     చటులక్రీడఁ జరించు నట్లిరువురు౯ శౌర్యోన్నతిం బోరీ రు
     త్కటదర్పోద్దతులై పరస్పరజయాకాంక్షా ప్రచండంబుగన్,"

అనుపద్యమునే రెండవపాదమున “పర్వధగద్దగీయమగుచున్" అనుపదములు. "మంటధగద్ధగయనన్ " అను పదములతో మార్చియు నాలవపాదమునందలి 'పరస్పరజయాకాంక్షా ప్రచండంబుగన్" అనుసమాసమును 'బరస్పరజయాకాంక్షం బ్రచండంబుగన్' అనివ్యస్తపదములగఁ జేసియు విరాటపర్వము మూఁడవ యాశ్వాసమున దక్షిణగోగ్రహణ యుద్ధమునం బ్రయోగించి యున్నాడు.

"శా. శ్రావ్యంబై చెలఁగ౯ గభీరమధురజ్యానాద ముద్దారువీ
     రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచు౯
     సవ్యప్రౌఢి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచు౯
     దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగ౯.”

అను నిర్వచనోత్తరరామాయణములోఁ జతుర్థాశ్వాసమున రావణకుబేరులకు జరిగినయుద్ధ సంధర్భమునఁ బయోగింపఁబడిన దానిని మార్పేమియుఁ జేయకయే విరాటపర్వపంచమాశ్వాస మున నుత్తరగోగ్రహణమున ద్రోణార్జునసమర వర్ణనమునం జొప్పించి యున్నాఁడు. ఇట్టివానిని పెక్కులు చూపవచ్చును. గ్రంధవిస్తరభీతిచే వానిని విరమించుచున్నాను.