పుట:Tikkana-Somayaji.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

తిక్కన సోమయాజి


అనుపద్యగద్యములనే ధర్మరాజు సాత్యకి నర్జునకుఁ దోడ్పడఁ బొమ్మనినప్పు డతఁ డతనితో నీసమాచారము జెప్పుసందర్భమునఁ బ్రయోగించి యున్నాఁడు. అప్పటిమాటలే యనువాదమునఁ జెప్పుట యెంతయుఁ జతురమై యుండెను.

కర్ణపర్వము ప్రథమాశ్వాసమునఁ గర్ణుని దినయుద్ధమున శల్యునిపోరు వర్ణించుసందర్భమునఁ బ్రయోగించిన

"సీ. కమలాకరములీలఁ గలఁచియాడెడు గంధ
           దంతావళము సముద్దండతయును
    దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా
           వధియించు కంఠీరవంబు నేపు
    నీరసారణ్యంబు నిర్భరాటోపతఁ
           గాల్చుదావాగ్నియుగ్రక్రమంబుఁ
    బ్రకటవిక్రాంతిఁ బురత్రయంబును సమ
           యించుఫాలాక్షునియేడ్తెఱయును

"ఆ. బోల్పఁ బడియెనపుడు భుజగర్వశౌర్యప్ర
     తాపదుర్దమప్రకోపములకు
     మద్రవిభుఁడు గోలుమసఁగి శాత్రవసైన్య
     హననకేళి సల్పునవసరమున.”

అనుపద్యమునే యాఁటవెలదిగీతి మొదటి పాదమున "పోల్పఁబడియెనపుడు" అనుపదములను "పోల్పబట్టుగాఁగ" అనుపదములతో మార్చి శల్యపర్వప్రథమాశ్వాసమున శల్యుని యుద్ధమును వర్ణించుచోఁ జెప్పియున్నాఁడు.