పుట:Tikkana-Somayaji.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
3
మొదటి యధ్యాయము


తిక్కనసోమయాజి గూడ తననిర్వచనోత్తర రామాయణములో

"సార కవితాభిరాము గుంటూరి విభుని
 మంత్రి భాస్కరు మత్పితామహునిఁ దలఁచి"

అని మంత్రిభాస్కరుని గుంటూరివిభుని గాఁ జెప్పి యుండెను. మంత్రిభాస్కరుఁ డొకసామాన్యకరణమే గాని ప్రాభవము గలవాఁడు గాఁడనియు, అతఁడొకగొప్పకవియును గాఁ డనియు, తనవంశగౌరవమును దెలుపుకొనుట కై తిక్కన యట్లు చెప్పుకొనె ననుభావమును దేఁటపఱచుచు భాస్కరోదంత మను విమర్శగ్రంథమునఁ బరిహాసపూర్వకవ్యాఖ్యానము చేయఁ బడియెను. [1] కాని తదితరవిషయములను న్యాయైకదృష్టితోడను నిష్పక్షపాతబుద్ధితోడను బరిశీలించి చూచి నప్పుడుమాత్రము మన మాయభిప్రాయముతో నేకీభవింపఁ జాలము. అమలాచారుఁ డనియును, సాహిత్యవిద్యాపారీణుఁ డనియును, శాపానుగ్రహాశక్తియుక్తుఁ డనియును, ధర్మమార్గపథికు డనియును,

  1. ఈ విమర్శగ్రంథము శ్రీయుత కాశీభట్ల బ్రహ్మయ్యగారిచే వ్రాయఁ బడినది.

    "ఏ కాలమునందు మంత్రిభాస్కరుఁ డుండె నని ప్రతిపక్షులు తలంచు చున్నారో యాకాలమున గుంటూరును బరిపాలించు చున్న ప్రభుఁ డొకఁడుగలఁ డని శాసనములవలనఁ దెలియ వచ్చుచున్నది. ఆకాలమున గుంటూరురాజ్యమునకుఁ బాలకుఁడు శ్రీమన్ మహామండలీక గుంటూరి యురయరాజు. అతనిమంత్రి బొల్లన. సేనాని రాయనిప్రెగ్గడయు నై నట్లుగా బెజవాడ మల్లేశ్వరస్వామివారి యాలయస్తంభమునఁ గలశాసనము వలనఁ దెలియవచ్చు చున్నది. ఈశాసనమును బట్టి చూడఁగా గుంటూరు పాలకుఁడు గాని, మంత్రికాని, సేనానికాని మంత్రి భాస్కరుఁడు కాఁడని తోఁచుచున్నది." అనికాశీభట్ల బ్రహ్మయ్యగారు తమభాస్కరోదంతమను విమర్శన గ్రంథము నందు వ్రాసి యున్నారు. ఈశాసనము క్రీ. శ. 1216 వ సంవత్సరమున వ్రాయఁ బడినది. ఈశాసనము వ్రాయఁబడినకాలమునఁ దిక్కభూపాలుఁడు జయంగొండచోళమండలము లోని పేరూరు నాడును బరిపాలించు చున్నవాఁడు. మంత్రిభాస్కరుని మూఁడవకుమారుఁడగుసిద్ధనామాత్యు డాతనికాప్తమంత్రిగ నుండె నని దెలిసికొని యున్నారము. కాఁబట్టి మంత్రిభాస్కరుఁ డింతకుఁ బూర్వము గొన్ని వత్సరముల క్రిందట నుండి యుండెను. అప్పు డీతఁడు గుంటూరునకుఁ బాలకుఁడు గా నుండె నని నమ్ముట కేవిధమైన యభ్యంతర ముండును ? (ఆం|| చ|| పే. 67-68)