Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

తిక్కన సోమయాజి

"ఉ. శ్రీ యన గౌరి నాఁబరఁగుచెల్వకుఁ జిత్తము పల్లలివింప భ
    ద్రాయతమూర్తియై హరిహరం బగురూపముఁ దాల్చి విష్ణురూ
    పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
    ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికి౯."

అని సకలబ్రహ్మప్రార్థనము చేసి తత్ప్రసాదలబ్ధకవిత్వతత్త్వ నిరతిశయాను భావానందభరితాంతః కరణుం డగుచుఁ బైని నుడివినవిధముగాఁ బదేనుపర్వములు రచించుటకుఁ బూనుకొని యీప్రబంధమండలి కెవ్వని నధినాధునిగాఁ బేర్కొందునా యనియొకనాఁడు వితర్కింపుచు నిద్రించెనఁట. ఇక్కడ తిక్కనసోమయాజి తనకుఁ గలపితృభక్తిని దేఁటపఱచుటకై చమత్కారముగా స్వప్నవృత్తాంతమును గల్పించి చొప్పించినాఁడు. తనతండ్రియైన కొమ్మనామాత్యుడు స్వప్నములోఁ గన్పడఁ దిక్కన నమస్కారము చేసెనఁట. అందుల కాతఁడు వాత్సల్య మతిశయించు నట్లుగా వాని నాదరించి దీవించి కరుణార్ద్ర దృష్టితోఁ జూచి యిట్లు పలికె నఁట. కుమారా! "కిమస్థి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వమ్| కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవస్వాదు వదప్రభోమే!” అని నీవు తొల్లి రచించిన పద్యమును గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుఁ డైనహరిహరనాథుఁడు నీదెస దయాళుఁడై యునికిం జేసి నిన్నుఁ గృతార్థునిఁ జేయఁ గార్యార్థి యయినాకలోకనివాసి యయిననాకుఁ దనదివ్యచిత్తమునం