పుట:Tikkana-Somayaji.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

తిక్కన సోమయాజి


భారత మాంధ్రభాషలో రచింపఁబడుట కర్తవ్య మని దృఢముగా నాతనిమనస్సునకుఁ దట్టెను. దీనినే తిక్కన సోమయాజి విరాటపర్వములో మొదట కృతినిర్మాణప్రస్తావనలో వివరించినాఁడు. విద్యత్సంస్తవనీయ భవ్యకవితావేశుఁడును, విజ్ఞానసంపద్విఖ్యాతుఁడును, సంయమిప్రకర సంభావ్యాను భావుఁడును, నగుకృష్ణద్వైపాయనుడు (వ్యాసుఁడు) అభిలాషతో లోక హితనిష్ఠను బూని భారతమనువేదమును ధర్మాద్వైతస్థితి ననుసరించి రచించె నని చెప్పినాఁడు. [1] ఇదియే ధర్మార్థకామమోక్షస్థితికి మూదల (మూలతల) యని నుడివెను. ఇట్టి భారతము నాంధ్రకవిత్వవిశారదుఁ డైన నన్నయభట్టారకుఁడు ప్రారంభించి మూఁడుకృతులు (మూఁడు పర్వములు) దక్షతతో రచించె నని,

"ఉ. ఆదరణీయసార వివిధార్థగతిస్ఫురణంబు గల్గియ
     ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెనుపొంది యుండ నం
     దాది దొడంగి మూఁడుకృత లాంధ్రకవిత్వవిశారదుండు వి
     ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టుదక్షత౯"

అనుపద్యములోఁ జెప్పి జనసంప్రార్థ్యము లౌటం జేసి నాలుగవపర్వ మగువిరాటపర్వము మొదలుకొని తక్కినపదునేను

  1. "శా. విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞానసం
         పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు గృ
         ష్ణ ద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించే ధ
         ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యంబైనయామ్నాయము౯."