పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాలను గ్రహించడానికి ఈలాంటి మనవజీవితాతీత నిర్మల నిశ్చల ప్రదేశాలు అనుకూలములు. ఆ సమయంలో ఏవి నాలో చర్చించుకున్నా, నా కవి నిమిషంలో స్పష్టమైపోయినవి. ఇంతలో నేను స్టవ్ వెలిగించి నీళ్ళు కాచుకొని, ముఖసంమ్మార్జనం చేసి, కాఫీ కాచుకొని తాగుతుండగా స్వామీజీ నలుగురు సన్యాసులతో నన్ను వెతుక్కుంటూ అక్కడకు వచ్చారు. ఆయన నన్ను చూచి ఆశ్చర్యపడి నాయనా! ఒక్కడవు వచ్చావని ఆలోచించాను. కాని నాకు భయం కలగలేదు. అందుకని ధైర్యంగానే ఉంటిని, కాని వడగండ్లవాన కురియడంవల్ల దారి తప్పిపోతావేమోనని తెల్లవారగట్ల బయలుదేరి వచ్చాము అన్నారు.


ద్వితీయ భాగము

కైలాసేశ్వరుడు


1

హేమసుందరీదేవీ, ఇక్కడ నుంచి జరిగిన మా సమాచారం యావత్తూ స్వామీజీ వ్రాశారు. మళ్ళీ నేను వ్రాయనవసరం లేదు. ఆయన భాష గంగానిర్ఘరిణే. అదంతా ప్రతి వ్రాసుకొని ఈనా జీవిత చరిత్రలో రెండవ భాగంగా స్వీకరిస్తున్నా. ఈ భాగం కొద్దే, ఆ పిమ్మట, నేను నీ దగ్గరకు వచ్చేటంతవరకు జరిగినది. నాలుగు ముక్కలు నేనే వ్రాసి నా చరిత్ర పూర్తిచేశాను. ఈ చరిత్ర ఉద్దేశము చిట్టచివర నీకు నివేదించాను....

                                                                                                                      శ్రీనాథమూర్తి.
       
       
                                                                                                        స్వామీజీ  కథనము 
   
   శ్రీనాథమూర్తి  ఎంతో  ఉత్తముడు. అతన్ని చూడగానే  నాకదేమో  అనిర్వ్యాజమైన వాత్సల్యం కలిగింది.  కర్మదుర్విపాకంవల్ల అతని  భార్య  పోయినది. అతడు పశువై పోయాడు. ఈ  బాలకుని  ముందుజీవితం  అఖండ  నిర్ఘరిణీ  వేగంతో  ప్రవహిస్తూ, దేశాల  పుణ్యవంతం చేయవలసి ఉన్నది.
   శ్రీనాథమూర్తి  ఉత్తమశిల్పి  కాగలడు. ఈనాడతనికి  ఎవ్వరి  బోధలు  రుచించవు. అతడే  అతని దారివెతుక్కోవాలి. హిమాలయాలలోనే  ఈతనికి  దారి దొరుకుతుందని తోచింది నాకు. వెంటనే  అతన్ని  మాజట్టుతో  కైలాసం  రమ్మన్నాను. అతనితో నేను  వాదించదలచుకోలేదు. అతనికి అవసరం  వచ్చినప్పుడే  ఇది  దారి  అని  చూపిస్తారా. అది  నిశ్చయము. నారాయణ! నారాయణ! దివ్యభావాలకు  కూడా  అతీతుడైన  పరమేశా!  బదరీ క్షేత్రాంతరమూర్తీ, కైలాసక్షేత్రపాలకా, అనంతప్రభూ, మేమంతా కైలాసం  వస్తున్నాము. కైలాస  పర్వత  సందర్శన మహాపుణ్యం నీకే అర్పిస్తున్నాము తండ్రీ! సెలవా?