పుట:Thittla gnanam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిష్యులు : మీరు దీవించిన తర్వాత కూడ అవినాశ్‌ మోక్షము పొందక దైవత్వములో కలిసిపోక మాతో సమానముగ జీవిస్తున్నాడు కదా! దీవెనలోని అర్థము జీవుడు నశించి దేవుడు కావలెననే కదా! అది ఇంతవరకు జరుగలేదు కదా!

గురువు : ఇపుడు వెంటనే జరగలేదను మాట వాస్తవమే. పెద్దల దీవెన వెంటనే ఎందుకు జరగలేదు? ఎప్పుడు జరుగును? అను ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే దీవెనలను గురించి పూర్తి వివరముగ తెలియ వలెను. దాని విషయమునే ఇపుడు సవివరముగ తెలిపెదను వినండి. దీవెననే మరియొక పేరుతో ' ఆశీర్వాదము ' అని అందురు. ఆశీర్వాదము ఎవరైన ఇయ్యవచ్చును. కాని నెరవేరునది ఒక్క బ్రహ్మర్షులైన వారి దీవెన మాత్రమేనని తెలియాలి. బ్రహ్మర్షులు దీవించిన ఆ దీవెన ప్రారబ్ధకర్మ మీద మాత్రము పనిచేయదని తెలియవలెను. ప్రారబ్ధము పుట్టుకతో మొదలై చావుతో అయిపోవును. అందువలన ఏ దీవెనైన ఆ జన్మ అయిపోయిన తర్వాతనే పనిచేయును. సర్వాధికారియైన భగవంతుని శరీరమునుండి వచ్చు పరమాత్మ దీవెన తప్ప ఇతరులెంతవారైన ఇచ్చు దీవెన తర్వాత జన్మలో జరగవలసిందే. కావున ఇపుడు నేనిచ్చిన మాట ప్రకారము అవినాశ్‌ తర్వాత జన్మలో మోక్షము పొందుటకు తగిన జ్ఞానశక్తికల్గి నాదీవెన నెరవేరును. ఈ పద్ధతి తెలిసి పూర్వము దీవించెడివారు. ఇపుడు తెలియని దానివలననే మీరు ప్రశ్నించారు. ఇంకా తెలియనివారు మరియు స్థూల శరీరమునే తామనుకొనువారు దీవెనలోని అర్థమును స్థూలమునకే వర్తింపజేసుకొని "నీవు నాశనమై పోనాని" అను దీవెనను తిట్టుగ భావించుకొని "నేను చనిపోవాలని దూషిస్తున్నావా" అంటున్నారు. స్థూల సూక్ష్మముల వివరము తెలియనపుడు, ఆత్మల వివరము తెలియనపుడు,