పుట:Thittla gnanam.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూసివేసి తిన్నట్లు నోటిని కదలించుచు ప్రయాణికుని ముందుకు వచ్చెను. ధనంజయ తింటున్నాడా లేదా అని గ్రహించని ప్రయాణికుడు తాను మాత్రము కాయనంతటిని తినెను. తిన్నతర్వాత తిరిగివారు ప్రయాణము సాగించిరి. ఒక కిలోమీటరు కూడ నడువకనే ప్రయాణికునికి మత్తు మొదలైనది. సారాత్రాగిన మత్తువలె ఉండుటవలన అతను తూలుతూ నడువసాగెను. కొద్దిసేపటికే మత్తు ఎక్కువై నడువలేక కూర్చుండెను. ధనంజయకూడ మత్తున్న వానివలె నటిస్తు క్రొత్తగ తిన్న వారికి మొదట కొంత ఎక్కువ మత్తుకనిపిస్తుంది ఏమి పరవాలేదు ఐదునిమిషములు కూర్చొని పోదామని చెప్పి అతనిని కూర్చండబెట్టెను. పాపము ప్రయాణికునికి మరిమత్తు ఎక్కువగుట వలన కూర్చున్న చోటునే పడుకొనెను. పడుకొన్న వాడు నిద్రలోనికి జారుకోగా ధనంజయ కోర్కెనెరవేరింది. అదే అదనుగ ప్రయాణికుని వద్దగల సూట్‌కేస్‌ను తీసుకొని దాని తాళములను కూడ అతనివద్ద వెదకి తీసుకొన్నాడు. వెంటనే సూట్‌కేస్‌ను తెరచి అందులోని డబ్బును తీసుకొని తనవద్దగల సంచిలో వేసుకొని తిరిగి సూట్‌కేస్‌ను మూసి అతనివద్దనే పెట్టి తాళములు కూడ అతని జేబులో వేసి అక్కడినుండి పోయెను. ప్రయాణికుడు విషముష్ఠి కాయను తినుటవలన మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలో కొంతసేపుండి అరగంటలోపలే చనిపోయెను.


గుణంజయ కోరుకొన్న కోర్కె స్వామి దీవించిన దీవెన ప్రకారము మరుజన్మమున ధనంజయరూపములో నెరవేరింది. కాని జరిగిన కార్యములో పాపము కర్మరూపమై ధనంజయ తలలో కర్మమందు చేరి పోయినది. గుణంజయరూపములో పొందినది దీవెనరూపములోనున్న చెడును చేకూర్చు తిట్టని తెలిసినది. ఇక్కడ జ్ఞానము లేకపోవుట వలన తిట్టును దీవెనగ అర్థము చేసుకోవడము జరిగినదని తెలియుచున్నది.

-***-