పుట:Thittla gnanam.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవజ్ఞానముగల ఒక పెద్ద స్వామీజీ గుణంజయగల ఊరికి వచ్చాడు. ఆ ఊరిలోని వారందరు ఆస్వామీజీ దర్శనమునకు పోయి ఆయన వద్ద కొంత జ్ఞానము తెలుసుకొని వచ్చుచుండిరి. ఆ స్వామీజీ మహత్యమును కొందరు గొప్పగ చెప్పుకొనుచుండగ గుణంజయ స్వామీజీని గురించి విన్నాడు. గుణంజయ వినుచుండగ ఒకడు మరొకనితో ఈవిధముగ అనుచుండెను. "నాకు ఎంతో కాలమునుండి జ్ఞానము తెలుసుకోవాలను కోర్కె ఉండెడిది. స్వామిగారి దగ్గరకు పోయిన వెంటనే నన్నుచూచి నీకోర్కె నెరవేరుతాదని దీవించాడు. ఆయన దీవించినట్లే ఆయన ద్వారా నాకు తెలియనిది తెలిసింది. నాకోర్కె నెరవేరినది" అని చెప్పాడు. ఆ మాటలువిన్న గుణంజయ కూడ స్వామి వద్దకు పోతే తనకున్న కోర్కెలు నెరవేరుతాయనుకొన్నాడు. వెంటనే స్నానము చేసి ముఖాన విభూది మెడలో పూసలమాల వేసుకొని, భక్తునివలె కనిపించు ఎర్రగుడ్డలు కట్టుకొని, స్వామి వద్దకు పోయి సాష్ఠాంగదండ ప్రమాణము చేశాడు. అతనిని చూచిన స్వామీజీ "కామ్యార్థ ఫలసిద్ధిరస్తు" అని దీవించాడు. జ్ఞానము తెలియని గుణంజయ అది దీవెనే అనుకొన్నాడు. సంపూర్ణ జ్ఞానియైన స్వామీజీ అతని అంతరంగములో గల కోర్కెను గ్రహించి ఆమాట చెప్పాడు. స్వామిగారి దగ్గరకు వచ్చినపుడు గుణంజయ మనస్సులో ఎవడైన చాలాధనము తీసుకొనిపోవు యాత్రికుడు ఒంటరిగ కనిపిస్తే వానిని ఏమర్చి వాని ధనమును సులభముగ కొట్టివేసి తాను ధనికుడు కావాలని కోర్కె ఉండెడిది. నీవు కోరుకున్న కొర్కె ఫలితము నెరవేరవలెనని స్వామీజీ దీవించాడు. గుణంజయ కోరుకొన్న కోర్కె తనకు మంచిగ తోచినప్పటికి పాపము తెచ్చిపెట్టునదే కావున అది చెడు కోర్కె. చెడే జరగవలెనని చెప్పిన స్వామీజీ వాక్యము గుణంజయకు దీవెనగ కనిపించినప్పటికి అది నిజముగ దూషణయేనని అతనికి తెలియదు.