పుట:Thittla gnanam.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామ్యార్థ ఫలసిద్దిరస్తు

దూషణరూపములో మిగిలియున్న దీవెనలను ఎక్కడైన కుగ్రామము లలో స్త్రీలు వాధించుకొనుపుడు తిట్లరూపములో వాడుచుండగ, దీవెనల రూపములోనున్న దూషణలను మాత్రము స్వాములుగనున్న పురుషులే ఎక్కువగ వాడుచున్నారు. వాటిలో అక్కడక్కడ వినిపించు కొన్ని వాక్యములను వివరించుకొందాము. మనిషికి గల గుణములు పండ్రెండు. అందులో ఆరుగుణములు చెడువి, ఆరుగుణము మంచివి గలవు. మంచి గుణములు పుణ్యమును, చెడుగుణములు పాపమును ప్రాప్తింపజేయును. పాపమును సంపాదించి పెట్టు చెడుగుణములలో ముఖ్యమైనది, మొదటిది ఆశ అనుగుణము. ఆశ అనుగుణము తన ప్రభావముతో మానవుని చేత ఏపనినైన చేయించును. ఆశ అనుగుణమును కామమని కూడ పిలుతురు. కామమును ఒక్క శృంగార విషయములో మాత్రము పనిచేయు గుణమనుకో కూడదు. ఏ విషయములలో అయిన ఆశ పుట్టితే దానిని కామమనవచ్చును. ధనము కావాలనుకోవడము కూడ కామమే అగును. ఆశ అనుగుణము చేత ధనము మీద కోర్కెకలుగడమును కామ్యార్థము అనికూడ అందురు. మొదట 'కామ్యార్థ ఫలసిద్ధిరస్తు' అనువాక్యము మానవునికి పాపమును చేకూర్చునదై చెడును ఆచరింపజేయు దూషణగ ఉండెడిది. అదెట్లనగా!


పూర్వము ఒకానొక ఊరిలో గుణంజయ అను వ్యక్తి ఉండెను. అతని పేరు గుణంజయ అయినప్పటికి అతనేమి గుణములు జయించిన వాడుకాదు. అట్లని సాధారణ వ్యక్తి కూడ కాదు, గుణములలో లోతుగ కూరుకుపోయిన మనిషి అతను. ఆశ అను గుణము మరి తీవ్రముగ పనిచేయుచుండెను. ఎల్లపుడు తనకు ఇతరుల సొమ్ము సులభముగ కావాలని కోరుకునే మనిషి. అతనికి దైవజ్ఞానమంటే ఏమిటో తెలియదు.