పుట:Thittla gnanam.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన సంకల్పము తప్పక జరిగితీరును, కావున దానిని శాపమనియే చెప్పవచ్చును. శాపము రెండు రకములని చెప్పుకొన్నాము కదా! అందులో ఒకటి దూషణ రెండు భూషణ. దూషణలను తిట్లని, భూషణలను దీవెనలని కూడ చెప్పుకోవచ్చును. తిట్లను, దీవెనలను చాలా చోట్ల, చాలా సందర్భములలో చూస్తునే ఉన్నాము. కాని ముఖ్యముగ ఎవరి మాటలను దీవెనలుగ, తిట్లుగ లెక్కించుకోవలెనో, ఏ మాటలను తిట్లుగ, ఏ మాటలను దీవెనలుగ భావించుకోవలెనో తెలియక మానవుడు పొరబడుచున్నాడు. ఎవరి మాటలు శాపములుగ జరిగి తీరునో తెలియక, ఎవరు కర్మను మార్చగల శక్తిగలవారో తెలియక చాలామందికి పాదాభివందనము చేయడము మానవునికి పరిపాటైనది. వందనము చేయించుకొనువారు మేము ఏ స్థాయి మనుషులమని ఆలోచించక, తాము దీవించు దీవెనలు జరుగునా అని యోచించక, మ్రొక్కినవారందరిని దీవించడము జరుగు చున్నది. మంచి చేయువారికంటే చెడు చేయువారు ఎక్కువ కనుక మ్రొక్కకున్న తిట్టేవారు అడుగడుగున కలరు.


తిట్టు లేక దూషణ అంటే చెడును సూచించునదని, అలాగే దీవెన అంటే మంచిని సూచించునదని తెలుసుకొన్నాము. మంచి చెడు ప్రాతిపదిక మీద మంచిని దీవెనగ, చెడును దూషణగ (తిట్టుగ) లెక్కించి చూచితే, మంచివారు శ్రేయోభిలాషులైన గురువులు మంచిని చేకూర్చుటకు దీవెనలను ఇచ్చుట, చెడువారు శత్రువులైన వారు చెడును చేకూర్చుటకు తిట్లు ఇచ్చుట పద్ధతి అనుకుందాము. ఈ పద్ధతి పూర్వము ఉండెడిది. ప్రస్థుత కాలములో పూర్వపు పద్ధతికి పూర్తి విభిన్నముగ ఉన్నదనియే చెప్పవచ్చును. ధర్మములు అధర్మములుగ మారుననుటకు ఇది కూడ ఒక ఉదాహరణ కావచ్చునను కుంటాము.