పుట:Thittla gnanam.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాపము గూల అనుమాట దూషణలోనికి చేరకుండ మధ్యలో ఊతపదము లాగ నిలచిపోగా, బ్రహ్మయోగిని సూచించు వాక్యము హేళన వాక్యమై నిలచిపోయినది.


కాల అనగ హిందీభాషలో నలుపు అని అర్థము. కాలము అనగ తెలుగుభాషలో కనిపించనిదని మరియు కనిపించకుండ పోవడమని అర్థము. కాలమును పరమాత్మ స్వరూపమని చెప్పవచ్చును. కాలము మనముందరే గడచి పోవుచున్నప్పటికి ఇది పలానయని ఎవరు గుర్తించలేరు. చీకటిలో కలిసిపోతే ఏది తెలియదు మరియు అన్నిటిని కనిపించకుండ తనలో కలుపుకొనుచున్నది కావున నల్లని చీకటిని కాలమని చెప్పుకొనుచున్నాము. కాలము భవిష్యత్తును వర్తమానముగ చేస్తున్నది, వర్తమాన కాలమును భూతకాలముగ చేస్తున్నది. కంటికి కనిపించని కాలము కంటికి కనిపించు వాటిని, చెవుకు వినిపించు వాటిని ఏమాత్రము వినిపించకుండ కనిపించకుండ చేస్తున్నది. ఆ విధానముతోనే ఎంతో జ్ఞానము కాలక్రమమున తెలియకుండపోయినది. అదే విధముగనే జ్ఞానముతో కూడుకొన్న దీవెనలు అజ్ఞానముతో కూడుకొని దూషణలుగ మారిపోయినవి. అలా మారిపోయి అందరికి మద్యలో ఉన్న వాటిని కూడ తిరిగి లేకుండ చేయడము కాలము యొక్క పని. కావున దూషణలుగనున్న దీవెనలు చివరకు దూషణలుగ కూడ లేకుండ పోవుటకు ప్రారంభించాయి. ఎక్కడైన పల్లెప్రాంతములలో మిగిలియుండి, అదియు ఆడవారి నోటిలో మెదలుచున్న కొన్ని దూషణలను జ్ఞానము ప్రకారము దీవెనలని చెప్పుకొని, వాటికి తిరిగి క్రొత్తగ అర్థము తెచ్చుకొన్నాము. అలాగే కొన్ని దీవెనలను జ్ఞానము ప్రకారము దూషణలని చెప్పుకొని వాటికి నిజమైన అర్థము ఏమిగలదో తర్వాత పేజీలో చూస్తాము.

-***-