పుట:Thittla gnanam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడు విడచిన వాడు

ఇదే విధముగ పూర్వము బ్రహ్మయోగిని గురించి చెప్పిన మాట నేడు హేళనగ మాట్లడునట్లు మారిపోయినది. దైవమును చేరుటకు గీతలో బోధించబడిన మార్గమును రెండు యోగములుగ ఉన్నవి. అవియే ఒకటి బ్రహ్మయోగము, రెండు కర్మయోగము. కర్మయోగము బయటి ప్రపంచముతో సంబంధము పెట్టుకొని పనులు చేయుచు సాధారణ మనిషి ఉండునట్లు కనిపించునదికాగ, బ్రహ్మయోగము బయటి ప్రపంచముతో సంబంధము పెట్టుకోక ఏ పనులు చేయక లోపల నిశ్చలతగ ఉండునది. బ్రహ్మయోగికి ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఒక వేళ పనిచేసిన ఆ విషయములను గ్రహించు మనస్సు ఉండదు. అతని ముందర బంగారపు ముద్దపెట్టిన, గుండ్రని రాయిపెట్టిన సమానమే. అలాగే అతనిని పొగడిన దూషించిన అవేవి ఆయనకు తెలియవు, కావున ఏ దానికి స్పందన ఉండదు. అందువలన బ్రహ్మయోగి విషయము తెలిసినవారు అతనితో ఎవరు మాట్లాడలేరని, ఎవరైన మాట్లాడిన అతను తిరిగి మాట్లాడడని, కనుక అతనితో ఎవరు మాట్లాడుతారని అనెడివారు. బ్రహ్మయోగి తన శరీరములో మూడు గుణవిషయములతో సంబంధము లేకుండ ఉండును. కావున మూడు విడచినవాడని అతనిని అనెడివారు. లోపల మూడు గుణములు విడచినవాడు మరియు బయట ఎవరితోను సంబంధములేనివాడు కావున "మూడు విడచిన వానితో ఎవరు మాట్లాడుతారని" బ్రహ్మయోగిని గురించి అనెడివారు. బ్రహ్మయోగి యొక్క గొప్పతనమును గూర్చి చెప్పిన మాటను మూడు విడచినవాడని అనగ ఈనాడు ఆ మాటను ఇతరులను హేళనగ మాట్లాడుటకు ఉపయోగించుచున్నారు. చెప్పిన మాటను వినని వానిని, ఒప్పుకోనివానిని అవహేళనగ మాట్లాడునపుడు మాట్లాడువారు మూడంటే ఏమిటి? మూడిటిని విడువమంటే ఏమిటి? అని ఆలోచించడము లేదు.