పుట:Thittla gnanam.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచములో పుట్టిన మనిషి సక్రమముగా నడుచుకొనుటకు నీతి, న్యాయము అవసరము. కానీ దేవునికి నీతి, న్యాయము అవసరము లేదు. దేవునివద్ద ఉండునవి జ్ఞానము, ధర్మము. దేవునికి ప్రపంచము నీతిగానీ, ప్రపంచపు న్యాయముగానీ అవసరములేదు. దేవుడు నీతి, న్యాయము ఆధారము చేసుకొని ఉండడు. దేవుడు జ్ఞానము, ధర్మములను కల్గియుండును. అందువలన మనిషి కూడ జ్ఞానము, ధర్మములను తెలుసుకొంటేనే దేవుని వద్దకు పోగలడు. అట్లుకాక ప్రపంచములోని నీతిని, న్యాయమును ఆధారము చేసుకొని ఎవరు దేవునివద్దకు పోలేరు. నీతి, న్యాయము వలన మనిషికి పుణ్యము, అవినీతి అన్యాయము వలన పాపము వస్తాయి, కానీ ముక్తిరాదు. అందువలన నీతి, న్యాయము లోక సంబంధమైనవి. జ్ఞానము ధర్మము దైవసంబంధమైనవని చెప్పవచ్చును. పుల్లయ్య తెలియక చెప్పినప్పటికి దేవునికి నీతి న్యాయము లేదు అనునది సత్యమైన మాటయే. ఈ విధముగా అనేక విధములుగా మంచిని చెడుగా, చెడును మంచిగా మనిషి అర్థము చేసుకోవము వలన తిట్లేలో దీవెనలేవో తెలియక, తిట్ల స్థానములోనికి దీవెనలు, దీవెనల స్థానములోనికి తిట్లు చేరిపోయినవి. ఉన్న సత్యమును ఆలోచిస్తే పూర్వమున్న భావమునకు, ఇప్పటి భావమునకు ఎంతో తేడా వచ్చినదని చెప్పవచ్చును. ఆ తేడాలనే ఈ గ్రంథములో విప్పి చెప్పడమైనదని గ్రహించవలెను. అట్లుకాక మేము ఏవో కల్పితములు చేసి వ్రాసినాడని అనుకోవద్దండి. ఇవి కల్పితమైన కవిత్వముగాదు, యదార్థమైన, మార్పు చెందిన విషయములని తెల్పుచున్నాము.

-***-