పుట:Thittla gnanam.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ పదము వాడితే, నేడు అజ్ఞానముతో దేవున్ని దూషించేదానికి ఆ పదమును కొంత మార్చి వాడుతున్నారు.

రామయ్య :- అరే! ఈ మాటలో ఇంత అర్థము దాగి ఉన్నట్లు ఎవరికీ తెలియదే! కాలక్రమేపి మాట కొంత మారిపోయి ఎంత అజ్ఞానములో పడి పోయాము.

ఈరయ్య :- అవును రామయ్య! మననోటివెంట వచ్చే మాటలు ఎంతో అర్థముతో కూడుకొనియున్నా, వాటి భావము మనకు తెలియకుండ పోయిన దానివలన మంచి మాటను చెడ్డమాటగా, చెడ్డమాటను మంచి మాటగా లెక్కించుకొనుచున్నాము. మనకు చెడును కల్గించు వాక్యములను దీవెనలని, మంచిని సూచించు వాక్యములను దూషించు తిట్లని అనుకొనుచున్నాము. ఇప్పుడు పుల్లయ్య కూడ తనకు తెలియని దానివలన మంచి వాక్యములనే పలుకుచు, దేవున్ని నిలదీసి అడిగినట్లు దేవునికి దయలేదు, నీతిలేదు, న్యాయములేదు అన్నాడు కదా! పుల్లయ్య ఏ భావముతో చెప్పినా ఆయన అన్నవన్ని సత్యమైన వాక్కులే. పుల్లయ్య దేవున్ని నిందించు భావముతో అనినా, వాస్తవముగా దేవుడు దయలేనివాడే. దేవునికి గుణములుండవు, దేవుడు గుణరహితుడు. కోపము అను గుణమునకు వ్యతిరేఖమైనది దయా గుణము. దేవుడు గుణరహితుడు కావున ఆయనకు మంచి గుణమైన దయగానీ, చెడు గుణమైన కోపముగానీ ఉండవు. అందువలన పుల్లయ్య చెప్పినమాట వాస్తవమైనదే. అంతేకాక పుల్లయ్య తన స్నేహితునితో దేవుని వద్ద నీతి, న్యాయములేదని అన్నాడు. ప్రపంచములో నీతి, న్యాయము లేని వానిని అవినీతి పరునిగా, అన్యాయపరునిగా మొత్తము మీద చెడ్డవానిగా లెక్కించుకొంటాము. పుల్లయ్య దేవుని మీద కోపముతో దేవుడు నీతి న్యాయము లేనివాడనినా ఆ మాట వాస్తవమే.