పుట:Thittla gnanam.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అడిగాడు. దానికి స్వామీజీ "నీకు వాక్కు ఇచ్చినవాడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు భగవంతుని మాట అది, కావున దానికి పరిష్కారమే ఉండదు. సాటిమనిషిగ కనిపించినందువలన ఆనాడు ఆయనమాటలను లెక్కించక ఆయనను గురించి ప్రక్కన హేళన మాట్లాడుకొన్నందుకు రోగము వచ్చింది. ఆయన వద్దకు భక్తితో పోవు వారిని చూచి వీరంతా మోక్షానికి పోయేవాళ్ళని అసూయతో మాట్లాడినందుకు నీవు ఎక్కడ పోకుండ కాలుపోయినది. గురువుగారి జ్ఞానమును తెలిసి విలువివ్వక పోవడము వలన నీకు స్వంత కొడుకు కోడళ్ళ వద్దనే విలువలేకుండ పోయినది. గురువుకే అబద్దము చెప్పి డబ్బు విషయములో మోసము చేసినందుకు నీవు సంపాదించిన డబ్బును నీవు అనుభవించేదానికి లేకుండ ఏమిలేనివానికంటే హీనముగ బయటపడి ఉన్నావు. ఇంత జరిగిన దైవజ్ఞానము కావాలనుకోక చావు కావాలనడము మూర్ఖత్వము కాదా! చావు నీ ఇష్టాయిష్టముల మీద ఆధారపడి ఉండదు. కావున అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది" అని చెప్పి వెళ్లిపోయాడు.


దీనిని బట్టి చూస్తే 'దీర్గాయుస్మాన్‌ భవ' అను మాట దీవెనవలె ఉన్నప్పటికి అది దీవెనకాదు దూషణయేనని తెలియుచున్నది. అట్లే నీవు నాశనమైపోనాని అనుమాట దూషణవలె ఉన్నప్పటికి అది దూషణకాదు దీవెనయేనని తెలియుచున్నది. అందువలన తిట్లలో జ్ఞానము, దీవెనలలో అజ్ఞానమున్నదని తెలుపుచున్నాము. తిట్లు దీవెనలను రెండురకములు ఉన్నప్పటికి దీవెనరూపములో చెడును సూచించు తిట్లు, తిట్ల రూపములో మంచిని సూచించు దీవెనలుగలవని తెలియుచున్నది. ఇపుడు తిట్ల రూపములోనున్న దీవెనలను వివరించుకొందాము.

-***-