పుట:Thimmarusumantri.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

81


చారు లేతెంచి యాతఁ డొంటరిగా దేవళమునకుఁ బోయిన వార్త దెలిపిరి, అతఁ డెంతయు వగచుచు రక్షకసెన్యముతో బోయి కృష్ణరాయనిం గలిసికొనియెను. అతఁ డచ్చెరువందియుఁ గొంచెము కోప మభినయించి “ఏమి పుట్టిమునిఁగినదని యిచ్చటి కేతెంచితి' వని తిమ్మరుసును బ్రశ్నించెను. అంత భయవినయంబు లెనయ మంత్రీంద్రుఁ డిట్లనియెను.

“మహాప్రభూ! దేవరవా రిటవచ్చు టెఱుంగక వెదకుచుండ నొకచారుఁడు రహస్యముగా నేలిక వచ్చినజాడఁ దెల్పి నందునఁ బౌరు లెవ్వరికిని నీనమాచారముఁ దెలియకుండఁ జేసి వేఁటకొఱకు మసప్రభువు బయలుదేఱి వెడలుచున్నాఁడు గావున మీఱందరును సన్నద్ధులై రావలసినదిని కొందఱు సైనికులకు వర్తమాన మంపి యిటకు వచ్చినాఁడను. మీ యిష్టానుసారముగా నేకార్యముఁ దలపెట్టినను నవలీల నిర్వహింప మీయాజ్ఞానువర్తులమై మెలంగు నావంటి మంత్రులుండ సమస్తవైభవముతో నొప్పెడి మందిరమును విడిచి యొంటరిగా నిచ్చటికి రాఁ దగునా ! నీరాక యితరులెవ్వరైనవిన్నచో నెంతవైపరీత్యము సంభవించునో దేవరవారికిఁ బొడగట్టెనేని యింతసాహసకార్యమునకు నొడిగట్టియుండరు. మీవంటిరాజధి రాజులు సామాన్యుల విధముగా నిట్లు రాఁజెల్లునా ? అయ్యో! ఎంతపని చేసితిరి?" అని తిమ్మరుసుమంత్రి న్యాయనిష్ఠుర వాక్యములతో మందలింపఁగా నారాజేంద్రుఁడు మందహాసము చేయుచు నిట్లు ప్రత్యుత్తుర మొసంగెను.