పుట:Thimmarusumantri.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

తిమ్మరుసు మంత్రి


తిమ్మరుసుచారపద్ధతి

అసామాన్యప్రజ్ఞాప్రగల్బుఁడు గావున ననుక్షణమును గంటికిఱెప్పవోలె తిమ్మరుసుమంత్రీంద్రుఁడు కృష్ణదేవరాయని సంరక్షించుచుండెను. అతఁడెంత రహస్యముగా నేమి గావించినను మఱుక్షణముననే మంత్రివర్యునికిఁ దెలియుచుండును. తిమ్మరుసవలంబించిన చారపద్దతి యాతనికిఁ దప్ప రాయనికిఁ గాని సామ్రాజ్యమున మఱియెవరికిఁ గాని దెలియకుండెను. ఇట్టి ప్రతిభావంతుఁ డగుటచేతనే తిమ్మరుసును గన్నెత్తి తేఱిపాఱఁ జూచుటకు నెల్లవారు భయపడుచుందురు. ఇతని చారవర్గమునందు స్త్రీలుసు, పురుషులును, కొజ్జాలును గలరు. ఇతనిచే నేర్పఱుపఁబడిన చారుల సంఖ్య యింతయని లెక్కింపనలవికాదు ఒకనాఁడు కృష్ణదేవరాయఁడు తనపై నుండు భక్తివిశ్వాసములచేఁ బ్రజలు విధేయులై యున్నవారో కేవలము తిమ్మరుసు వలని భయముచేత విధేయులై యున్నవారో స్వయముగా బరీక్షింపగోరి పట్టపగ లెవ్వరికి జెప్పకుండ నొక్కఁడు నంతఃపురము బయలుదేఱి నగరములో దూరముననున్న యొకదేవళమును బ్రవేశించెను. అచటి స్థానికు లీతని రాయనిగా నెఱింగి శుద్ధజలంబు లొసంగిన నతఁడు నామతీర్థం బొనరించి తద్దేవతా నివేదనపదార్ధము లుపయోగించి కృతాచమనుఁడై సుఖముగా గూరుచుండెను. ఇంతలో నియమిత స్థానమున రాయఁడు లేకండుటఁ గాంచి తిమ్మరుసు తత్తరింపుచు వెదకుచుండఁ దన