పుట:Thimmarusumantri.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమ ప్రకరణము

73


బువ్వులలో బుట్టి పువ్వులలో బెఱిఁగినవాఁడవు. ఆగర్భ శ్రీమంతుఁడ వగుటంజేసి సుఖములనేగాని యెన్నఁడును గష్టముల నెఱుంగవు. ఇపుడు నీవు బహుజనపరిపాలకుఁడవు గాఁబోవు చున్నావు. ఇంతటినుండి మేము నీయాజ్ఞానువర్తులము కావలసినవారము గాని నీకు బుద్ధులు గఱపవలసిన వారము గాము. దండనాపారుష్యమువలనఁ బ్రజలకుఁ గలుగుబాధ ప్రభువు స్వానుభవమువలనఁ గ్రహింపఁడేని యట్టిప్రభువు ప్రజలను క్రూరదండనల పాలుచేసి జనకంటకుం డనిపించుకొనును. అట్టి దండనాపారుష్యమువలనఁ గలిగెడి నొప్పి ప్రభున కనుభవములో నుండుట ప్రజలపాలిటి భాగ్యమని చెప్పఁదగును. అట్టి భాగ్యము నీప్రజలకును, అందుమూలముగా నీకీర్తి విస్తరించుభాగ్యము నీకును, గల్గించుట కిపు డీకార్యముం జేసినాఁడను నీవు విశ్వాసపాత్రుఁడ వని నమ్మి అన్నివిద్యలలోని మర్మము నీకిదివరకే తెలిపియున్నాఁడను. ఇంతవఱకు నీవు మాకృష్ణరాయలవే. ఇపుడు నీకు దీనిని దెలుపుకున్న నిఁక ముందుఁ దెలియజేయుటకు సాధ్యపడదని యీవిద్యనుగూడ నెఱింగించి నిన్ను రాజ్యముఁ జేయఁ బంపుచున్నాఁడను. ఇఁక నీవు పోయి యెనుబదిలక్షల వరహాలతో నిండియున్న బొక్కసమును గైకొని సింహాసనాధిరోహణము గావించి యాచంద్రార్కస్థాయిగాఁ గీర్తినిఁ వహింపఁజేయునట్టి ప్రజాపరిపాలనముఁ జేయుము” అని తిమ్మరుసు దీవించెను. అంత కృష్ణరాయఁడు తిమ్మరుసు బుద్ధి