పుట:Thimmarusumantri.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

తిమ్మరుసు మంత్రి


రాయనికిఁ బట్టముఁగట్టి నీవు కార్యకర్తవై సామ్రాజ్యమును బరిపాలింపవలసినదని నాయజ్ఞ. నీవు నాకుమారునకుఁ బట్టము గట్టక యాతనిఁ జంపించి కృష్ణరాయనికి బట్టము గట్టెదవని నాకిప్పుడొక పెద్దయనుమానము పుట్టినది. కావున నిఁకముందు కృష్ణరాయనివలన రాజ్యమున కేవిధమైన యుపద్రవము పొడమకుండ నుండుటకు నీవు కృష్ణరాయని కన్నులు పెఱికించి తెప్పించి నాకు చూపించిన గాని నాప్రాణములు పోవు” అని పలికి యట్లు చేయ నామంత్రివర్యున కాజ్ఞాపించెను. ఆపలుకులు చెవులకు ములుకులై నాట నదరిపడి తిమ్మరుసు యొకింతసేపు మౌనము వహించి ధైర్యము తెచ్చుకొని సాహసముతో నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.

“రాజేంద్రా ! ఇ దెంతపని ? దీనికై నీవు పరితపింప నక్కఱలేదు. ఇది మనస్సులోఁ బెట్టుకొని బాధపడకుము. నేనుపోయి యవశ్యము నీకార్యముఁ దీర్చి వచ్చెద" నని చెప్పి సెలవు గైకొని తన మందిరమునకు వెడలిపోయెను.

తిమ్మరుసు పరివేదనము.

కృష్ణరాయనికి విద్యాబుద్ధులు గఱపి పెంచి పెద్దవానిని జేసినది నేను. నేను బెంచిన మొక్కను ద్రుంచివేయ వీరసరసింహదేవరాయఁడు నా కాజ్ఞాపించినాఁడు. ఆహా ! ఇతఁ డెంత కుటిలాత్ముఁడు? ఎంత క్రూరచిత్తుఁడు? పితృసమానునిగ