పుట:Thimmarusumantri.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

తిమ్మరుసు మంత్రి


వీరనరసింహదేవరాయని పరిపాలనము.

వీరనరసింహరాయఁడు తనతండ్రియైన నరసింగరాయఁడు సాహసింపఁజాలని కార్యమునకుఁ దానొడిగట్టి యిమ్మడి నరసింగరాయనిఁ దోసిపుచ్చి తానే రత్నసింహాసన మాక్రమించుకొని తిమ్మరుసు తన్నుఁ బట్టాభిషిక్తునిఁ జేయ నవక్రపరాక్రముఁడై పరిసంధిరాజుల నుక్కడంచి ధరావలయమును బరిపాలించి మహారాజాధిరాజు, రాజపరమేశ్వరుఁడు, రోషకృతప్రతిపార్థి పదంపాడుఁడు, శేషభుజక్షితిరక్షణశౌండుఁడు; భాషిగెతప్పువరాయరగండఁడు, మూరురాయరగండడు, పరరాజ భయంకరుఁడు, హిందూరాయసురత్రాణుఁడు, దుష్టశార్దూల మర్ధనుఁడు, గజౌఘగండభేరుండుఁడు మొదలగు ప్రసిద్ధబిరుదములనుబొంది యాఱేండ్లు పరిపాలనము చేసెను. అదివఱకు సంపాదించిన దేశములను జక్కబఱచుకొని సామ్రాజ్యమును స్థిరపరచుకొనుటకు మాత్రమె ప్రయత్నించెను గాని గజపతులను, అశ్వవతులను జయించుటకుఁ దలఁపెట్టియుండలేదు. ఆకార్యమును బూనకపూర్వమే క్రీ. శ. 1509 వ సంవత్సరములో జాడ్యగ్రస్తుఁడై కాలధర్మము నొందుట సంభవించెను. అతఁడు మరణముఁ జెందునప్పటికిఁ నాతనికిఁ దిరుమలదేవరాయడను నెన్మిదేండ్ల వయస్సుగల కుమారుఁ డొకఁడుండెను.

వీరనరసింహరాయని దుష్టబుద్ది.

వీరనరసింహరాయఁడు కుటిలస్వభావుఁడనియుఁ గ్రూరచిత్తము గలవాడనియు మొదటనే చెప్పి యున్నాఁడను,