పుట:Thimmarusumantri.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(9)

చతుర్థ ప్రకరణము

55


కొనుటవలనఁ గార్యభంగ మగునని తలంచి తిమ్మరుసును దనకు దోడ్పడవలయునని ప్రార్థించెను. తిమ్మరుసందులకు సంతసించి మంత్రిత్వమును బూని నరసింహుని విద్యానగర సామ్రాజ్యముస కభిషిక్తుని గావించెను. అదివఱకు ద్రావిడాంధ్ర కర్ణాట దేశములలోఁ గప్పములు చెల్లించు రాజులనేకులు వీరనరసింహరాయని ప్రభుత్వము నంగీకరించినను కర్ణాటదేశములోని సామంతనృపాలు రనేకులు కప్పములు చెల్లింపమని తిరస్కరించిరి. ఇమ్మడి నరసింగరాయనితో మఱికొందఱు కుట్ర చేయుచుండిరి. ఒక్కమాఱుగ సామ్రాజ్యమునఁ గల్లోలము జనించెను.

వీరనరసింహుని దిగ్విజయయాత్ర.

తిమ్మరుసుమంత్రి ప్రతిభాఢ్యుఁడు గావునఁ దురుష్కుల నుండి యపాయము కలుగ కుండుటకై తుంగభద్రానదీ తటమున నొక కొంత సైన్యమును, గజపతు లాక్రమించుకొని రాకుండ నుదయగిరి ప్రాంతము సరిహద్దున నొక కొంతసైన్యమును గాపు పెటెను. ఇమ్మడి నరసింగరాయనిఁ బెనుగొండ రాజ్యమున కధిపతిని గావించి యాతని సమాధానపఱచి యా ప్రక్కనుండి గలిగెడి యుపద్రవమును దప్పించుకొనియెను. రాజధానియగు విద్యానగరమున మూలబలము విశేషముగా నుంచి సమర్థులును విశ్వాసపాత్రులునగు దండనాధులను గొందఱను నగరరక్షకత్వమున నియమించెను. అట్టి దండనాథులలో దిమ్మరుసు తమ్ముఁడు గోవిందరాజు ప్రముఖుఁడుగా నుండి నగర