పుట:Thimmarusumantri.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

తిమ్మరుసు మంత్రి


తిప్పాంబ విషప్రయోగముచే సపత్ని పుత్త్రుని జంపింపఁ బూనికొనియె నన్నసమాచారము దెలియరాఁగా తిమ్మరుసు మంత్రి విచారించి వానిని మృత్యువువాతఁ బడకుండ సంరక్షించెను. అంతటితో నిరుత్సాహపడి యూరకుండక తిప్పాంబ మఱింత దిట్టతనమును బూని కృష్ణరాయని జంపింప ముమ్మారు ప్రయత్నించెను గాని తిమ్మరుసు వానిని ప్రాణాపాయమునుండి తప్పించి తిప్పాంబదౌష్ట్యమును దలపోసి తనయింటనే యుంచుకొని వానిని సంరక్షింపుచు వచ్చెను. ఆమె దుష్ప్రయత్నము లన్నియు నొకదానివెనుక నొకటి భగ్నములయ్యెను. ఇట్లు కృష్ణరాయని ప్రాణములను గాపాడి విద్యాబుద్ధులు గఱపుచు, బెనుచు చున్నందునఁ గృష్ణరాయఁడు తిమ్మరుసుమంత్రిని 'అప్పాజీ' (నాయనగారూ) అని పిలుచుచుండెను. తిప్పాంబ కుమారుఁడైన వీరనరసింహదేవరాయఁడు భుజబలపరాక్రమ సంపన్నుఁడైనను కుటిల స్వభావుఁడును గ్రూరచిత్తము గల వాఁడునై యుండెను. వీరనరసింహరాయనికిఁ దనపై ససూయ జనింపకుండ నాతని యువరాజునుగా భావించుచు తిమ్మరుసు మంత్రి యాదరింపుచు రాజనీతిధర్మముల నుపదేశింపుచుండెను. అఖండ ప్రజ్ఞాధురంధరుఁడైన యుగంధరుని వంటివాఁడని వీరనరసింహరాయఁడు తిమ్మరుసును పితృసమునిగా భావింపుచు నాతనిదయను సంపాదించుకొనుటకై విధేయుఁడై యాతని కిష్టమైనరీతిగా వ్యవహరించుచుండెను.