పుట:Thimmarusumantri.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

49


సామ్రాజ్యమునంతను బిడికిటఁ బట్టి యింటను బైటను నిరంకుశాధికారియై ప్రవర్తించు చున్నాఁడు. ఇతని కాదని యెదుర్కొనుట పట్టపురాణి నైననాకే సాధ్యముగాకయుండ మఱియెవ్వనికి సాధ్యమగును. ఇమ్మడి నరసింగరాయని దూరముగాఁ గూరుచుండఁబెట్టి నరసరాయని ప్రతాపమును జాటుచు నాతని వలలో వేసికొని సరసరాయని పేరుతో తానే సామ్రాజ్యము నేలుచున్న యీబ్రాహ్మణమంత్రి నరసరాయని మరణానంతరము నాకుమారుఁడైస వీరనరసింహరాయనికిఁ బట్టము గట్టునని నాకెట్లు నమ్మకము కలుగఁగలదు? తిమ్మరుసుమంత్రియుఁ గృష్ణరాయఁడు బ్రతికియుండఁగా నా కుమారునకు రాజ్యము లభించు ననుమాట కల్ల. కావున వీరిలో నెవ్వనినైనఁ జంపించినఁగాని నాకోరిక కొనసాగదు. తిమ్మరుసుమంత్రిని జంపించుట సాధ్యమగుపనికాదు. అదియునుగాక యతనిఁ జంపించితిమేని కట్టడ దప్పి రాజ్య మరాజకము కావచ్చును. అప్పుడు నాకుమారునకే యీ రాజ్యము దక్కునని చెప్పరాదు. మఱియు నతఁడు బ్రాహ్మణుఁడు. అతని జంపితినేని బ్రహ్మహత్యాదోష మెన్ని జన్నములకైనను నన్ను విడుచునా? కావునఁ గృష్ణరాయని జంపించుట కార్యసాఫల్యమునకు ముఖ్యము. అది సులభ సాధ్యము.”

ఇట్లు తలపోసి తిప్పాంబిక తన దాసీకన్యకలతోఁ గృష్ణరాయని విషప్రయోగముచేఁ జంపించుటకై దురాలోచనము చేసి వెంటనే యా దుష్కార్యమునకుఁ గడంగెను.