పుట:Thimmarusumantri.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ ప్రకరణము

43


సంస్కరణములను గావింపవలసి యుండెను. రాజ్యంగమును బలపఱచుకొన్నఁ గాని తురుష్కులతో వైరముఁ బెట్టుకొని సాధించుటకు బ్రయత్నించుట యుత్తమపద్దతి కాదని యూహించి సైన్యాధిపతులు ప్రోత్సహించినను తురుష్కుల నుద్ద్రేకింపఁజేయు మార్గములపొంతఁ బోక యాయవమానమును సహించి యూరకుండెను. విజయనగరమున కుత్తరఫుదిక్కున శిధిలములై యున్న ప్రాకారములను దుర్గములను బలపఱిచెను. ఎన్నిదినములు ముట్టడించినను శత్రువుల కభేద్యమై యుండునట్లు చేసెను. నగరరక్షుకసైన్యమును పెంపు గావించెను. బొక్కసము ధనముచే నింపు చుండెను. ప్రతిసంవత్సరమును గజబలమును, హయబలమును కొంచెముగనో ఎక్కువగనో చేర్చు చుండెను. సామ్రాజ్యమున దన కనుకూలు రెవ్వరో, ప్రతికూలు రెవ్వరో తెలిసికొని ప్రతిగూలురను, నేర్పరితనముచే వశపఱచుకొను చుండెను. ఆదిల్‌షాహా తనకు జయము గలిగినందులకు నెంతసంతోషించినను, ఎప్పుడైనను తిమ్మరుసు మంత్రి తనరాజ్యమునకు ముప్పు దేఁగలడని దృఢముగా విశ్వసించినవాఁడు గావునఁ దరువాత నతఁడు తిమ్మరుసుతో నొడంబడిక జేసికొనియెను. ఇట్లుభయరాజ్యములవారు గొంతకాలము మైత్రి గలిగియుండిరి.


___________