పుట:Thimmarusumantri.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

తిమ్మరుసు మంత్రి

"రాజేంద్రా! ఈ సామ్రాజ్యమునకై మీతండ్రియును సైన్యాధ్యక్షుఁడైన నరసరాయఁడును పొందినశ్రమ యింతింత గాదు. మీతండ్రియెడఁగల భక్తివిశ్వాసములచేత తుళువ నరసరాయఁ డెప్పుడును మీతండ్రికి కుడిభుజముగా నుండి యీ సామ్రాజ్యసంపాదనమునందుఁ దోడ్పడి ప్రతిపక్షులనుక్కడంచి యీ మహాసామ్రాజ్యమునకంతకుఁ బట్టాభిషిక్తుని గావించి ప్రతిభ గాంచినవాఁడు గాని సామాన్యుఁడు గాఁడు. మీతండ్రి స్వరస్థుఁడైనను మీతండ్రి యభీష్టము ప్రకారము మీయన్నను బట్టాభిషిక్తునిఁ గావించి సమస్త రాజ్యభార ధురంధరుఁడై ప్రజాపాలనము సేయుచుండ సహింపఁజాలక దుర్మార్గుఁడై నీ హితుఁడైన దళవాయి వానిని రహస్యముగా జంపించెను. ఈ యపనిందఁ దనపైఁ బడెనని విచారించి నరసరాయఁడు స్వామిద్రోహి కాఁడు గావున నిన్నుఁ బట్టాభిషిక్తుని గావించి నీచేతఁ బరిపాలనము సేయించుచున్నాఁడు. దీనిని నీవు విస్మరించి భ్రాతృహంతకుఁడైన యా దుర్మార్గునితో మైత్రి నెఱపుచు కృతఘ్నుఁడవై నరసరాయనికిని నాకును నపహరముఁ జేయఁ జూచు చున్నాఁడవు. నీవు బాలుఁడవు. లోకవృత్త మెఱుంగనివాడవు. నీచులను జేరఁదీసి మెత్రి నెఱుపుదువేని తుదను సామ్రాజ్యమును, ప్రాణములనుగూఁడ గోలుపోవలసి వచ్చును. కావున నాప్రార్ధనమును మన్నించి దుర్మార్గులతోడ సహవాసమును మానుము. ముఖ్యముగా భ్రాతృహంతకుఁడైన యా దళవాయినిఁ చెఱబట్టి యుంచుట యొండె, దేశమునుండి