పుట:Thimmarusumantri.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(6)

ద్వితీయ ప్రకరణము

31


చచ్చినవైనను మూఁడుగుఱ్ఱములకు వేయివరహాలచొప్పున నిచ్చుటకుఁ బ్రారంభించినందున మూరులను మహమ్మదీయ వర్తకులును, ఫోర్చుగీసువర్తకులు నశ్వములను గొనివచ్చి, సాళ్వనరసింహరాయని కమ్మి ధనవంతు లగుచుండిరి. తన కొఱకై తెచ్చిన గుఱ్ఱములు సముద్రముమీఁదఁ జచ్చినను వానితోఁకలను తెచ్చినపక్షమున ధన మొసంగు చున్నందున వర్తకు లావ్యాపారమును విడువక సాగించుచుండిరి. అందువలన స్వల్పకాలములో నరసింహుని యశ్వబలము శత్రుజన భయంకర మయ్యెను. ఇట్లు సాళ్వనరసింహభూపతి జీవచ్చవముగా నుండి కునుకుచున్న రాష్ట్రమున నుత్సాహక్రియాశక్తుల స్వసామర్థ్యముచే నెల్లెడలఁ బురికొల్పి పునర్జీవనము గల్పించి శత్రుభయంకరుఁడై ప్రజాపాలనముఁ జేయుచుండుట చేతఁ దురుష్కులును విదేశీయులగు పోర్చుగీసువారును, కర్ణాటరాజ్యమును 'నరసింగనిరాజ్య' మనియె వ్యవహరించిరి. తురుష్కులనుండి రాచూరుదుర్గమును గజపతులనుండి యుదయగిరిరాజ్యమును వశపఱచుకొనవలయునని యుత్సాహపడు చుండెను. గాని విధివశంబున నాకోరిక లీరిక లెత్తకముందే స్వర్గస్థుడగుట సంభవించెను. ఇతఁడీ సార్వభౌమపదవికి వచ్చిన తరువాత నెక్కువకాలము పరిపాలనము చేసినట్లు గస్పట్టదు. ఇతఁడు తనమరణకాలమునందుఁ దనపెద్దకుమారుని రాజును జేసి యతఁడు బాలుఁ డగుటచే సెన్యాధ్యక్షుడైన నరసరాజును గార్యకర్తనుగా నియమించెను.


___________