పుట:Thimmarusumantri.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

తిమ్మరుసు మంత్రి


జేయకుండెను. తుళువనరసరాయనిమంత్రి యనుమాటయె కాని తిమ్మరుసు విద్యానగరముననుండి రాజకార్యధురంధరుఁడై నరసింహ సార్వభౌమునకు సలహాల నందిచ్చుచుఁ బరిపాలనమునఁ దోడ్పడుచుండెను. ప్రధానమంత్రిత్వపదవిని వహింప వలసినదని సార్వభౌముఁడు కోరినను తిమ్మరుసు తనకంటె వృద్దులై చిరకాలమునుండి యాశ్రయించుకొని భక్తిశ్రద్ధలు చూపి కొలుచుచున్న మంత్రిపుంగవులను గాదని వయస్సునఁ చిన్నవాఁ డగుఁదా నాపదవి నపేక్షించుట క్షేమకరము గాదనియు, మిత్రభేదమునకు హేతువగుననియు, దేశశాంతికి భంగకర మగుననియు నచ్చఁజెప్పి సామ్రాజ్యముపట్ల సదాసేవాపర తంత్రుఁడనై యుందునని వాగ్దానము గావించెను. తుళువ నరసభూపతియు సార్వభౌముఁడు నాతని బుద్దికౌశల్యమును శ్లాఘించిరి. విద్యానగరమునఁ దిమ్మరుసు ప్రసిద్ధి సర్వత్ర వ్యాపించెను. ఒకనాఁడు నరసింహసార్వభౌముఁడు తిమ్మర్సు మంత్రిని బిలువనంపించి యిట్లనియెను.

“తిమ్మనమంత్రీ! నీవు కడుబుద్ధిశాలివి. నాకొక్క కోరికగలదు. అశ్వపతులైన బహమనీ సుల్తానులును, గజపతులైన కళింగదేశాధీశ్వరులును. మనకుఁ బ్రబలశత్రువులై యున్నారు. కర్ణాటరాజ్యాధిష్ఠితుఁడనై నరపతిసార్వభౌముఁడనై యున్నను అట్టిశత్రువు లస్మద్రాజ్యము నపహరించి ప్రవర్థమానులగుచుండఁ జూచుచు నే నెట్లూరకుండఁ గలను. అశ్వపతు