పుట:Thimmarusumantri.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ప్రకరణము

25


'నేతిబీరకాయ' యన్నట్లు ప్రౌఢదేవరాయల నామమును వహించిన యాకామినీమనోహరుఁడు విద్యానగర సింహాసనాధిష్ఠితుఁడైన యాకర్ణాటప్రభువు వినియు విననట్లుండెను. నరసారాయఁడు రాజభవనము సమీపించు చున్నాఁడని సందేశమును దెచ్చినభటుని విశ్వాసపాత్రునిఁ బరిభవించి పంపించెను. వినాశకాలమునకు విపరీతబుద్ధి జనించిన దని యెల్లవారును దలంచి యుపేక్ష వహించి యుండిరి. ఇట్లు నరసారాయఁడు నగరమంతయు మహావైభవముతో నూరేగి రాజభవనము సమీపించి ద్వారపాలకులఁ బాఱఁద్రోలి యంతయు వశపఱచుకొన్నను నామందభాగ్యు డంతఃపురములోని శయ్యాగృహమును విడిచి బయలకు రాలేదు. తుద కాసేనాని రాజు పండుకొని యున్నగృహము సమీపింపఁగా దనకు రానున్న యపాయము నపుడు గ్రహించి ప్రాణరక్షణార్థము దిడ్డివాకిటనుండి తప్పించుకొని నిజమందిరమును, నగరమునుగూడ విడిచి పాఱిపోయెను. ఇట్లతఁడు పాఱిపోయె నన్నవర్తమానమును విని నరసారాయఁడు వానిం బట్టుకొనుటకై శ్రమపడక తత్క్షణమ ధనభాండారమును నగరము నంతయు స్వాధీనముఁ జేసికొని సాళువనరసింహభూపాలున కీవృత్తాంతమును దెలుపుచు విద్యానగరమునకు విచ్చేయుమని సందేశమంపెను. నగరమునంతయు నరసారాయనికి గడగడలాడుచుండెను. నగరములోని యాబాల వృద్దు లీమార్పునకు సంతోషించిరి. బహుస్వల్ప సంఖ్యాకుల కిది కంటకముగాఁ గాన్పించినను వీరి నెదుర్కొనునంతటి శక్తి