పుట:Thimmarusumantri.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

తిమ్మరుసు మంత్రి


భూపతియు తిమ్మరుసు పలికినపలుకులయందలి యధార్థ్యమును గ్రహించి కాలయాపనముచేయక వలసినసైన్యములను కొలది కాలములోనే సమకూర్చి తిమ్మరుసు పెట్టిన శుభముహూర్తమునఁ బ్రయాణభేరి మ్రోగించి దండయాత్రకు బయలు దేఱెను. నరసారాయనితోఁ దిమ్మరుసుకూడ నుండెను. తిమ్మరుసు మంత్రిసత్తముఁడు మాత్రమే గాక సమరక్రమ మెఱింగిన మహాయోధుఁడుకూడ నై యుండెను. అందువలన నరసారాయనికి మిక్కిలి సహాయకారిగ నుండెను. ఇట్లు గుత్తినగరము నుండి దండయాత్ర వెడలి విద్యానగరముఁ జేరి నగరము వెలుపల విడిసియున్నప్పుడు తిమ్మరుసుమంత్రి కర్ణాటరాజ్యసంరక్షకులై యుండిన దండనాధులకు సామంతనృపతులకు నరసారాయనిపేరుతో తాము వచ్చిన కార్యముయొక్క ప్రయోజనమును దెలుపుచు లేఖలను వ్రాసి పంపెను. సాళువనరసింహ భూపాలునికీర్తి యప్పటికే రాష్ట్రమునందంతట వ్యాపించి ప్రసిద్ది వహించి యుండుటచేత నెవ్వరును దత్సైన్యాధ్యక్షుఁడును సమర్ధయోధుఁడు నైనతుళువనరసారాయని నెదుర్కొన సాహసింప లేదు. నరసారాయఁ డనేకులకు గానుక లంపించెను, ఇట్లు విద్యానగరములోని దండనాధుఁ లెల్లరును వశ్యులై మౌనము వహించియుండ నరసారాయఁడు నగరమున కెంతమాత్రము నష్టము గలిగింపక రణభేరి మ్రోగించుచు నగరము సొచ్చి దానును సేనలును మహావైభవముతో నూరేగుచు రాజభవనము సమీపించుచుండెను. ఇట్లు జరుగుచున్న దని