పుట:Thimmarusumantri.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ప్రకరణము

21


ప్రాపకమువలన నభివృద్ధి బొందఁగలిగెనో యట్టి రాజకీయ విద్యాగురువైన చిట్టిగంగనామాత్యుని బోధనమును మాత్రము మఱవక యాతరుణము నెట్లు సద్వినియోగమునకు దేవలసియుండునో దానిని జక్కగా నాలోచించి హైందవధర్మరక్షణార్ధ మీహైందవసామ్రాజ్యము సముద్ధరించుట తనకు విధ్యుక్త ధర్మమని నిశ్చయించెను. అప్పు డుపేక్ష చేసినయెడల నావల బ్రమాదము జనింపవచ్చును. విద్యానగరము బహమనీసుల్తానులవశ మయ్యెనేని హైందవసామ్రాజ్యము క్రమముగా నంతరించుసు. హైందవసామ్రాజ్యముతో నార్యధర్మములు తాటా దూటములగుట నిశ్చయము. ప్రజ్ఞావంతుఁడని, ప్రతిభాఢ్యుఁ డని, సమర్థుఁ డని తలంచియే చిట్టిగంగనామాత్యుఁడు భావి స్థితిని దలపోసి యీవిషయమై తన్ను బ్రబోధించినప్పుడు తిమ్మరుసు మిడిగ్రుడ్లు పెట్టుకొని యూరక చూచుచున్న పక్షమున నాతఁడును సామాన్యుని వంటివాఁడే యగును. అతడొకనాఁడు నరసారాయనికడ కేగి యిట్లనియెను. “నరసరాయా ! కర్ణాట ప్రభువు దౌర్భాగ్యస్థితి నంతయు విను చున్నావుగదా? అతఁడు రాజ్యమును బరిపాలింప నర్హుఁడుగాఁడు. ఎప్పుడు నంతఃపురము విడిచి రాఁడు. రాజ్యాంగముఁ గన్నెత్తిచూడఁడు. తురుష్కులు కృష్ణదాటి వచ్చిరి. సామంతనృపతులు స్వాతంత్ర్యమును బ్రకటించుచున్నారు. ఈ సమయమును జూచి బహమనీసుల్తాను విద్యానగరముపై దండెత్తి వచ్చి వశపఱచుకొనునేని హైందవరాజ్యము లింక నిలుచునా ? హిందూమతధర్మములు తాఱు