పుట:Thimmarusumantri.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ప్రకరణము

19


రుసును దనకు ముఖ్యమంత్రిగఁ జేసికొనియెను. నాదిండ్ల చిట్టి గంగనామాత్యుఁడు తిమ్మరాజునకు, గోవిందరాజునకు వివాహమైనపిమ్మట స్వర్గస్థుఁడయ్యెను. అచిరకాలములోనే తిమ్మరుసు ప్రజ్ఞావిశేషములు రాజ్యమునఁ బ్రవర్థిల్లుచు బహుజనశ్లాఘాపాత్రములై యాతని యశోవైభవమును నలుదిక్కులకుఁ బఱపుచుండినవి.

మహావిప్లవము

కర్ణాట సామ్రాజ్యమును బరిపాలించుచున్న యిమ్మడి విరూపాక్షరాయలు తన దుష్టప్రవర్తనముచేత జనకంటకుఁ డయ్యెను. నిరంతరము సురాపానప్రమత్తుఁడై కామినీజనపరి వృతుఁడై యంతఃపురమును విడిచి రాక మంత్రులకుఁ గాని, దండనాధులకుఁ గాని మోమయినఁ గనుబఱచక మైమఱచి విహరింపుచుండెను. ఇది గూడదని మందలించిన దండనాధులను బెక్కండ్రను దుష్టుఁడై చంపించెను. ఇమ్మడి విరూపాక్షుఁ డిట్లు దుష్పరిపాలనమున కొడిగట్టి జనకంటకుఁడై యుండుటఁగాంచి సామంతనృపతు లెల్లరును స్వతంత్రులై యెవరిరాజ్యములను వారు పరిపాలించుకొనుచుఁ గప్పములు గుట్టుట మానిరి. పశ్చిమసముద్రతీరమునందలిరేవు లన్నియుఁ బరాధీనములై నవి. తుంగభద్రాకృష్ణా మధ్యదేశమును దురుష్కు లాక్రమించుకొనిరి. కళింగదేశాధీశ్వరులైన గజపతు లుదయగిరి రాజ్యమును వశ