పుట:Thimmarusumantri.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ప్రకరణము

తుళువవంశము.[1]

మొదట చంద్రగిరిరాజ్యమునకు, నటుపిమ్మట నూత్న కర్ణాట సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుడైన సాళువగుండయ నారసింహ భూపాలుని సైన్యాధ్యక్షుడును, ముఖ్యమంత్రియు నగు నరసరాజు తుళువ వంశమునందు జనించిన యీశ్వరరాజునకుఁ బుత్త్రుఁడై యుండెను. ఈశ్వరనాయకుండును గొంతకాలము సాళ్వనరసింహ భూపాలునకు సైన్యాధ్యక్షుఁడుగ నుండెను. వీరిది తుళువవంశము. ఈ వంశమునఁ దిమ్మయదండనాధునకు నీశ్వరరాజు జనించెను. వీనికి నరసరాజు పుట్టెను. ఈశ్వరరాజు విఖ్యాత సేనాధీశ్వరుఁడుగానుండి బహుదేశములను

  1. మహమ్మదీయ మహాయుగములో తుళువవంశము సాళువవంశాంతర్గతమనియు, తుళువ నరసరాజు సాళువనరసరాజునకు అన్నమనుమఁడనియు శ్రీయుత కొమఱ్ఱాజు లక్ష్మణరావుపంతులు, ఎం.ఏ. గారు వ్రాసియున్నారు. ఆంధ్రకవుల చరిత్రములో “ఈ తిమ్మయ ఈశ్వరరాజు సాళువగుండ నరసరాజునకు సేనానాయకుఁడగుటయేగాక దాయాదుఁడుకూఁడ నై యుండుటచేత నాతని యనంతరమున రాజ్యమును వహించినట్లు తోఁచుచున్నది" అని యొకచోటను, "నరసింహరాజునకు (సాళువ) తిమ్మరాజను పేరుగల జ్యేష్టబ్రాత యొకఁడుగలఁడు. ఆతఁడే యీశ్వరరాజు తండ్రియైన సాళువతిమ్మరాజని తోచుచున్నది" అని యొకచోటను శ్రీయుత రావుబహదరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు వ్రాసిన వ్రాఁతయె పైవారు వ్రాసినవ్రాఁత కాధారమై యుండవచ్చుమ. ఇందుకు బ్రమాణ మెవ్వరును జూవలేదు. తుళువనరసరాయని కంకితము గావింపఁబడిన వరాహపురాణములో నంది మల్లన ఘంటసింగయకవులు సాళువవంశము వేఱుగను, తుళవవంశము వేఱుగను, స్పష్టముగ వర్ణించి యుండ వీ రిట్లు వ్రాయుట వింతగా నున్నది. వరాహపురాణవతారిక లోను, ఆశ్వాసాంత పద్యములలోను కృతిభర్త సాళువవంశీయుఁడని వక్కాణింపఁబడక తుళవాన్వయుండని వ్రాయుటయే యీయుభయవంశము లొక్కటికావని స్పష్టమగుచున్నది. కాఁబట్టి సాళువవంశము వేఱనియు తుళువవంశము వేఱనియు మన మిప్పటికి స్పష్టముగా నిర్ధారింపఁవచ్చును.