పుట:Thimmarusumantri.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

తిమ్మరుసు మంత్రి


చారాయణుఁడు, కింజల్కుఁడు మొదలగు స్మృతికర్తలు వ్రాసిన నీతిశాస్త్రములు నేఁడుఖిలములై యున్నను, ఆకాలమున వ్యాప్తములై యున్నందున వానిలోనిరహస్యముల నన్నిఁటిని తెలియఁ జెప్పెను. కౌటిల్యునియర్థశాస్త్రమును, కామందకుని నీతిసారమును జక్కఁగా జదివించి ప్రజ్ఞాఢ్యునిఁ గావించెను. ఇట్లధిక శ్రద్ధాభక్తులు గలిగి చిట్టిగంగనామాత్యునివలనఁ దిమ్మరుసు మంత్రి విద్యాసముద్దేశము, వృద్ధసంయోగము, అమాత్యోత్పత్తి, మంత్రిపురోహితోత్పత్తి, దూతప్రణిధి, జనపదనివేశము, దుర్గవిధానము, దుర్గనివేశము, సీతాధ్యక్షత్వము, పణ్యాధ్యక్షత్వము, శుల్కాధ్యక్షత్వము, ధర్మస్తేయము, వ్యవహారము, కంటకశోధనము, యోగవృత్తము, అరిమిత్రో దాసీ నాది ద్వాదశరాజమడలములు, వివిధరాజ్యాంగముల యుత్తమస్థితి, శమవ్యాయామికము, పౌరుషము, దైవసహాయము, సంధి విగ్రహాయాన ద్వైధీభావాసన సమాశ్రయములు, వ్యసనాధి కారికము, అభియాస్యత్కర్మము, సాంగ్రామికము, సంఘవృత్తము, అబలీయనము, దుర్గాలంబోపాయము, ఔపనిషదికము, స్వబలోపఘాతప్రతీకారము, వంచనము, తంత్రయుక్తులు మొదలగు మహావిషయములను గూర్చిన పరిజ్ఞానమును మెండుగా సంపాదించెను.


___________