పుట:Thimmarusumantri.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

155


యలు వహించు బిరుదములను 1526 - 27 సంవత్సరములోఁ దానే వహించి రాజైనటుల ప్రకటించుకొని యుండుట సంభవింపదు. కనుక కృష్ణదేవరాయలు 1526 లోనే మృతిఁబొంది యుండుటయే సత్యము కావలయును. కృష్ణరాయలు 1526 లో మృతిఁబొందినను అళియరామరాయాదు లావిషయము గోప్యముగానుంచి అచ్యుతదేవరాయనికిఁగాని వాని పక్షమువారికిఁ గాని 1530 వఱకు విజయనగరమునఁ బ్రవేశము కలుగనీయక యుందురు. అందువలన వానికిఁ బ్రతిపక్షులగువారు, వాని మృతిని వెల్లడించి అచ్యుతదేవరాయనికిఁ దిరుపతి కాళహస్తులలోఁ బట్టాభిషేక కార్యమును బట్టుదలతో జరిపియుందురు. ఇట్టి తగవులాట సమయమున విజయనగర సామ్రాజ్యము తెఱువఁబడిన యిల్లువలె నుండును. ఇట్లుండుటచేతనే యీయదను గనుపెట్టి యుత్తరమున గోలకొండ సుల్తాను, ఒడ్డె రాజగు ప్రతాపరుద్రగజపతి విజయనగర సామ్రాజ్యముపై దండయాత్రలు సాగించిరి. ఈసందర్భమున అల్లసాని పెద్దనామాత్యుని చాటు పద్యముగూడ ప్రబలసాక్ష్యము గానున్నది. ఒడ్డెరాజగు ప్రతాపరుద్రగజపతి విజయనగరముపై దండెత్తి వచ్చినప్పుడు పెద్దన్న చెప్పిన పద్య మిట్లున్నది.

"సీ. రాయరావుతుగండ రాచయేనుఁగు వచ్చి
               యారట్లకోన గోరాడునాఁడు
    సంపెటనరపాల సార్వభౌముఁడువచ్చి
               సింహాద్రిజయశిలఁ జేర్చునాఁడు