పుట:Thimmarusumantri.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

153


లును, మఱికొందఱు మండలాధిపతులును కృష్ణదేవరాయల కుమారుఁడని చెప్పఁబడెడి శిశువు పక్షముననుండి కృష్ణరాయలు మృతిజెందిన వెనుక 1530 సంవత్సరమువఱకుఁ దగవులాడుచు నుభయపక్షములవారు తమ పక్షములను బలపఱచుకొనుచుండిరని మాత్రము విశదపడకమానదు. కృష్ణరాయలు చనిపోవునపుడు తన తరువాత అచ్యుతదేవరాయలను బట్టాభిషిక్తుని గావించి తాను యువరాజుగానుండి సామ్రాజ్యపరిపాలనమునందు తోడ్పడుచుండవలసినదని రామరాయల కాజ్ఞాపించెనని పెనుగొండ కైఫియతునందుఁ దెలుపఁబడినది. పోర్చుగీసు చరిత్రకారుఁడైన ఫాదిరీక్వెరోజను నాతఁడు తానువ్రాసిన సింహళవిజయమను చరిత్రమునందు వ్రాసిన వ్రాతఁపై కైఫియతునందలి యభిప్రాయమునే బలపఱచుచున్నది. మఱియు నీతఁడు కృష్ణరాయని యాజ్ఞను శిరసావహించి రామరాయలు ప్రవర్తించెననియు, అందు కాతఁడు చూపిన దయకు సంతోషించి తనతోఁ గలిసి రాజ్యమును బరిపాలించుట కంగీకరించె సనియు, ఆదోషమువలన రామరాజు నే నిజమైన రాజుగా లోకము గ్రహించుటయు, హక్కు కలిగియున్న రాజగు అచ్యుతదేవరాయలను లోకము గ్రహింపలేకపోవుటయు సంభవించి అందుకు ప్రతిఫలముగాఁ దగు శిక్ష నాతఁ డనుభవించే ననియు వ్రాసియున్నాఁడు. కాని 1530 సంవత్సరములో విజయనగరమున అచ్యుతదేవరాయలు నిజముగాఁ బట్టాభిషిక్తు డగువఱకు వీనికిని రామరాయలకును మైత్రి కుదురలేదు.