పుట:Thimmarusumantri.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

తిమ్మరుసు మంత్రి

 లసత్యవంతు లగుదురు. వివేకు లవివేకు లగుదురు. జీవితరంగమున దారిద్ర్యము నెదుర్కొని పోరాడి జయించినవాఁడె మహావీరుఁడు గాని బలాఢ్యుఁడై రణరంగమున శత్రువుతలఁ దఱిఁగిన వాఁడు మహావీరుఁడు గాఁడు. మనుజునకు దీనింబోలినశత్రువు ధాత్రిలో మఱియొకటి గానరాదు. ఆత్మగౌరవ మున్నవాఁడు, జితేంద్రియుఁడైనవాఁడు, స్వశక్తి విశ్వాసము గలవాఁడు, దైవమునెడ శ్రద్ధాభక్తులు చూపువాఁడు, నిరంతరకర్మఠుఁడునైనవాడు మాత్రమే దారిద్ర్యభూతమును బాఱఁద్రోలఁగలఁడు. వీనితేజస్సుముందు దారిద్ర్యభూతము సుస్థిరముగా నిలువఁజాలదు. ఇట్టి సుగుణసంపత్తిగల ప్రతిభాశాలికిమాత్రమె దుర్భరమైన దారిద్ర్యముతోడి పోరాటము సాధ్యమగును. సమర్ధుఁడైన ప్రతిభాశాలిమాత్ర మీ పెనుభూత మాడించినట్లాడఁడు. వీనితోఁ బోరాటము పెట్టుకొనె నేని దారిద్ర్యభూతము దినక్రమమున దనబలము నంతయుఁ గోల్పోయి తనబలము నంతయుఁ దనశత్రువు గైకొనఁగా కడపటవానిని విడిచి యదృశ్యమైపోవుట నిశ్చయము. ఆ బాలురిఱువు రట్టి ప్రతిభాశాలురగుటంజేసి దారిద్ర్యభూతము నొకలెక్కగాఁ గొనక స్వప్రయత్నముచే విజయమును సాధింప సమకట్టిరి.

విద్యాభ్యసనము.

రామునియెడ లక్ష్మణుఁ డెట్టిభక్తివిశ్వాసములు చూపి యుండెనో యట్లే గోవిందుఁడు తనయున్నయగు తిమ్మనయెడ