పుట:Thimmarusumantri.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(22)

దశమప్రకరణము

151


పుణ్యముకొఱకు దేవునకు నొకగ్రామమును దానముచేయుట విరుద్దముగాఁ గన్పట్టదా ! సాళువతిమ్మరుసుమంత్రి శ్రీకృష్ణదేవరాయలను సామ్రాజ్యాధ్యక్షునిగాఁ జేయుట కెట్లుతోడ్పడియెనో అట్లే అచ్యుతరాయలను విజయనగరసామ్రాజ్యాధ్యక్షునిగాఁ జేయుటకు నీసాళువచెల్లప్పభట్టనే వీరనరసింహమంత్రి తోడ్పడియెనని మనము భావింపఁగలిగినయెడ నిందు విరుద్దముగాఁ గాన్పించునదేమియుఁ గన్పట్టదు. కృష్ణదేవరాయలు 1526 మరణించినను 1529 లో మరణించినను ఉరుత్తూరుశాసన సంవత్సరమునాటికి (1529) అచ్యుతదేవరాయనికి విజయనగరమునఁ బ్రవేశించుటకవకాశము చిక్కియుండలేదనుట నిశ్చయము. అందుకై సాళువనరసింగరాయనాయకుని ప్రాపుననేయుండి రాజధానీనగరమగు విజయనగరము నాక్రమించుకొని యందలి వజ్రసింహాసనమునగూరుచుండి పట్టాభిషిక్తుఁ డగుటకు దృఢప్రయత్నమునుగావింపుచుండెనని తలంచుటలో వ్యతిక్రమమేమియుఁ గన్పట్టదు.

ఇందు కింకొక దృష్టాంతమును జూపెదను. కన్నడదేశమున సొరాబు తాలూకాలోని యొకశాసనములో దానకర్త “అచ్యుతరాయల పాలనము సామ్రాజ్యమున సుస్థిరముగా నుండవలయునని కోరుచు దానము చేసి యుండెను. ఇయ్యది 1529 లోనిది. ఈశాసనకాలమునాటికి అచ్యుతరాయల పట్టాభిషిక్తత స్థిరపడియుండ లేదనుట స్పష్టము. అచ్యుతరాయలఁగూర్చిన పైసందర్భ విషయము లిట్లు ఘోషిం