పుట:Thimmarusumantri.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

149


కుమారుఁడు. చెల్లప్పయను పేరుగలవాఁడు. ఇతఁడు శాసనములలో వీరనరసింగనాయకుఁడనియు, సాళువదండనాయకుఁ డనియు వ్యవహరింపఁబడుచువచ్చెను. ఇతఁడు కృష్ణరాయనికి ముందునుండియు సామ్రాజ్యమున నొకయధికారపదవిలోనుండి క్రమముగాఁ బైకివచ్చినట్లుగన్పట్టుచున్నది. వీనిశాసనములు 1510 నుండి 1531 వఱకు గన్పటుచున్నవి. ఇతఁడు 1510 లో మధురమండలములోని తిరుపత్తూరు ప్రాంతప్రదేశమున కధికారిగానుండి తరువాత 1515 నుండి చోళరాజ్యమున కంతకును బ్రభువై తరువాత దక్షిణదేశమునకుఁ బ్రతినిధిపాలకుఁడై విజయనగరసామ్రాజ్యమునఁ బేరుప్రఖ్యాతులు గలిగిన మహాసామంతులలో నొక్కఁడుగానుండెను. ఇతఁడు కృష్ణదేవరాయలు బ్రదికియున్నంతవఱకు పరమవిశ్వాసముతో నాతనిసేవించి యుండినవాఁడు. ఈతనిరాజ్యమునుండి కోట్లకొలదిద్రవ్యము సామ్రాజ్యమునకు పరుమానముగాలభించు చుండెను. ఇతఁడు అచ్యుతరాయలకు మొదట విజయనగర సింహాసన మధిష్టింపఁజేయునంతవఱకుఁ బట్టుకొమ్మగానుండి తదనంతర మొకసంవత్సరములో గర్భశత్రువుగా మాఱిపోయి యటుపిమ్మట చక్రవర్తిపై తిరుగుబాటుచేసి మహాఘోరయుద్ధములుసలిపి పరాజితుఁడైనవాఁడు. అళియరామరాయలకుఁ బ్రతిస్పర్థిగ నిలువఁగలిగిన మహావ్యక్తిగాని సామాన్యవ్యక్తికాఁడు. ఎంతోబలము, పలుకుబడిగలవాఁడగుటచేతనే అచ్యుతదేవరాయలు వీనిఁజేఁబట్టెను. అచ్యుతరాయలీతని ప్రాపును