పుట:Thimmarusumantri.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

147


వలసినదనియు వ్రాయించి యున్నాఁడనియుఁ దెలిపియున్నాడు. చెన్నపురి ప్రాచ్యలిఖితపుస్తక భాండారమునను స్థానికచరిత్ర వృత్తాంతములుగల సంపుటములలో నొకదానియం దుదాహరింపఁబడిన పద్యములోఁ గృష్ణరాయలు శా. శ. 1442 నగు తారణసంవత్సర జ్యేష్ట శు. 2 భానువారమునాఁడు స్వర్గస్థుఁడయ్యెనని తెలుపబడియున్నది. ఆకాలమునాటి శాసనములను బరిశోధించినచోఁ గృష్ణరాయలు 1529 వఱకు బ్రదికియున్నట్టు దెలిపెడు శాసనములు పెక్కులు గన్పట్టుచుండుటచేఁ గొందఱీ పద్యమును గల్పనగా భావింతురు.

తనచే విరచింపఁబడిన "అచ్యుతరాయాభ్యుదయ" మను కావ్వమునందు రాజనాథడిండిమభట్టను కవీంద్రుడు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి సాన్నిధ్యమందు అచ్యుతదేవరాయనికిఁ దొల్తఁ బట్టాభిషేకముఁ జరిగినట్లుగాఁ దెలిపియున్నాఁడు. కాళహస్తిపుణ్యక్షేత్రమున నొకశాసనములో శా. శ. 1452 అగు విరోధనామసంవత్సర కార్తీక బహుళ గురువారమునాఁడు (21 అక్టోబరు 1529) అచ్యుతదేవరాయలు విజయనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడై నటుల దెలుపఁబడినది. అచ్యుతదేవరాయలను దనమరణానంతరము సామ్రాజ్యాభిషిక్తుని గావింపవలసినదని కృష్ణరాయలు మరణశాసనరూపమున నాజ్ఞాపించినపుడు 1526 లో రాజధానీనగరమునకు దూరముగానున్న తిరుపతిలో శ్రీవేంకటేశ్వరసన్నిధానమునందు మొదటను, 1529 లో కాళహస్తిలో