పుట:Thimmarusumantri.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

తిమ్మరుసు మంత్రి


మంత్రియగు తిమ్మరుసున కాజ్ఞనిచ్చినపుడు తిమ్మరుసట్టి దుర్మార్గమున కొడిగట్టక చావనున్న నాతని సంతృప్తి పఱచుటకై కృష్ణరాయని దాచివుంచి మేక కన్నులను జూపించి యుండవచ్చును. కృష్ణరాయలను మృత్యువాతనుండి తప్పించి నరసింహరాయల కుమారుఁడు పసిబాలుఁడగుటచేత సామ్రాజ్యభారము నిర్వహింపఁగలవాఁడు యౌవనప్రాదుర్భావముతో నొప్పుచుండిన కృష్ణరాయలే సమర్థుఁడైనవాఁడని యెంచి కృష్ణరాయనిఁ బట్టాభిషిక్తుని గావించియుండిన మాట సత్యమె. ఇట్టిపని ప్రధానామాత్యుఁడు నిర్వర్తింపవలసిన విధ్యుక్తధర్మములోనిదే కాని యన్యముగాదు. ఇదియంతయు జ్ఞప్తియదుంచుకొనియె తన యన్నవలెనె తాను తన సవతిసోదరుల జెఱలో నున్నవారినిఁ గడతేర్చినయెడల సామ్రాజ్యము తన కమారునికే యుండఁగలదని తలపోసి తన మనోభిప్రాయమును దన కాప్తుఁడైన తిమ్మరుసునకుఁ దెలియఁజేసి యుండును. అందుల కాతఁ డొడంబడక తన యన్న తన్నుఁ జంపుటకుఁ బ్రయత్నింపఁ దన్ను రక్షించిన విధానమును జెప్పి యాతని మందలించి యాదుష్కార్యమునుండి తొలఁగించి యుండును. ఇంతియ గాక చేఱలోనున్నవారి రక్షణభారమును దాను వహించి వారిని చెఱనుండి విడిపించి యుండును. అందువలన నాతనికి గొప్ప యనుమానమును భయమును బుట్టి తాను బ్రదికి యుండఁగానే తన కుమారునకుఁ బట్టముఁగట్టి వానికి వయస్సు