పుట:Thimmarusumantri.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

తిమ్మరుసు మంత్రి


వెంటఁ జనియెను. ఏడులక్షల సైన్యమును నడిపించుకొనిపోయి కృష్ణరాయఁడు తురుష్కులతో ఘోరయుద్దముచేసి సంపూర్ణ విజయము గాంచిన వెనుక విజాపురసుల్తాను సంధిచేసికొని నాటినుండి చాలకాలము విజయనగరప్రభువులతో మైత్రి గలిగి యుండెను. యుద్ధకాలమునందు స్వయముగా తిమ్మరుసు పాలుగొనకపోయినను తిమ్మరుసు చూపినమార్గము ననుసరించిపోయి రాయఁడు విజయమును గాంచెను. అట్లు విజయమునుగాంచి కృష్ణరాయఁడు మరలి విజయనగరమునకు వచ్చినవెనుక తిమ్మరుసు రాయనివీక్షించి 'దేవా! సాళ్వనరసింహభూపాలుఁడు గాని మీతండ్రి నరసింహదేవరాయఁడుగాని, మీయన్న వీరనరసింహదేవరాయఁడు గాని సాధింపలేక విడిచిన వానిని నీవు సాధించి వశపరచుకొంటి' వని బహువిధముల శ్లాఘించెను.

'అప్పా! ఇది యంతయు భవత్కృపావిశేషమువలన నైనది కాని మఱియొండు కా' దని తన కృతజ్ఞతాబుద్దిని వెల్లడించెను.


___________