పుట:Thimmarusumantri.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ ప్రకరణము

5


మహైశ్వర్యపదవి యబ్బు ననియు, మహారాజభోగంబు లనుభవింతుననియు నీమహానుభావుఁ డెవ్వఁడో పలికి పోయెనే? ఇతఁ డేమిపరిహాసమునకై పలికెనా? ఇతఁడు నావంటిబాలునితో పరిహాస మేల చేయును? ఇతఁడు వాక్పారిశుద్ధ్యము గల సిద్ధునివలెఁ గానుపించు చున్నాఁడు. అవు నతఁడు సిద్ధుఁడే అతని పలుకు వృధావోవదు. నేను తప్పక యైశ్వర్యపదవిఁబడయుదు. మహారాజభోగము లనుభవింతును. అందులకు నేను మున్ముందు విద్యాధనమును సముపార్జింతును. ఎన్నికష్టములనైనఁ బడి ముందుగా విద్యాధనమును గడించిన నైశ్వర్యము దానంతట నదియె చేకూరఁగలదు.”

ఇట్లు చింతించుచు నాతఁడు చంద్రగిరికి మరలివచ్చెను. తనతమ్ముఁడు గోవిందుఁడు తోడిబాలురతో నాడుకొనుచుండ నాతనిం బిలిచి సిద్ధుఁడు తన్నుఁజూచి పలికినపలుకులు చెప్పెను. అప్పలుకులు విని గోవిందుఁడు పక్కుననవ్వెను. బాలు రెల్లరును విని 'మనతిమ్మనికి మహైశ్వర్యపదవి యెత్తునఁట! మహారాజభోగంబు లనుభవించు నఁట ! విన్నారా యీ వింత? అని పరిహాసముగాఁ బలుకుచుఁ జప్పటులు గొట్టిరి. ఒక బాలుఁడు సమీపించి 'తిమ్మన్నా ! నీవు మహారాజ వగుదువేని నాకు మంత్రిపద మీయవలెను జుమా" అని నుడివెను. మఱియొక బాలుఁడు సమీపించి "మనతిమ్మన్నకు మహైశ్వర్య మెత్తినప్పుడు మన కందఱకు మున్నూఁటయఱువది దినంబులు బూరె