పుట:Thimmarusumantri.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

తిమ్మరుసు మంత్రి


ఈతఁడు రాజమహేంద్రవరమును జయించినట్లీ క్రిందిపద్యములోఁ దెలిపియున్నాఁడు.

“క. రాజమహేంద్రవరాధిపు
    రీజైత్రవిచిత్రములఁ బరిభ్రాజితుఁ డై
    యాజిఘనుం డాయిమ్మమ
    హీజాని ప్రసిద్ధిఁ గాంచె నెంతయు మహిమన్."

అట్లు రాజమహేంద్రపురమును గైకొని యందు కొన్ని నెలలుండి యాసమీపమున గౌతమీతీరమున నున్న రహితాపురము మొదలగు మన్నెసంస్థానములను లోఁబఱచుకొని పిమ్మట మఱికొంతదూరము పోయి బాహుబలేంద్రుని వంశస్టులకు కొంతకాలము ముఖ్యపట్టణమై యుండిన పొట్నూరును జయించి యందొక జయస్థంభమును నెలకొల్సి మాడుగులు మొదలగు మన్యసంస్థానముల నాక్రమించుకొని మత్స్యవంశస్థుల దగువడ్డాది (ఒడ్డాది) మసియొనర్చి సింహాచలస్వామిని సందర్శించి యచట దండు విడిసి యుండఁగా గజపతి సైన్యములు గంటికి గానక పలాయనములయ్యెను. అంతటితో రాయలు సంతుష్టి నొందక తిమ్మరుసుమంత్రి వలదని వారించుచున్నను వినక సైన్యములఁ గటకపురికి నడిపింపుమని తిమ్మరుసున కాజ్ఞ చేసెను. అతఁడు సైన్యముల నరణ్యమార్గములగుండఁ గటకపురి వఱకుఁ గొనిపోయెను.