పుట:Thimmarusumantri.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

తిమ్మరుసు మంత్రి


బాల్యదశ.

ఒకనాఁడు తిమ్మన చంద్రగిరిప్రాంతారణ్యభూములలోఁ తిరుగాడుచు నలసి మధ్యాహ్నసమయమున నొక చెట్టునీడను బరుండి గాఢనిద్ర పోవుచుండెను. అంతట సూర్యుఁడు పశ్చిమమునకు వాలుటచే సూర్యకిరణము లాతనిమోమును సూటిగా దాకుచున్నను మెలఁకువ రాక గాఢనిద్ర పోవుచున్నయాబాలుని సమీపమునకు నొకకృష్ణసర్ప మరుదెంచి తనఫణమును విప్పి వానిమోమున నెండ సోఁకకుండ గొడుగువలె నడ్డము పెట్టెను. అప్పుడాదారిని పోవుచున్న సిద్ధుఁడొక డాయద్భుత చర్యను గన్నులారఁ గాంచి యాబాలుఁడు మహైశ్వర్యపదవి నొందఁగలఁడని గ్రహించి సమీపమునకుఁ బోగా నాసర్ప రాజము వానిని విడిచి పాఱిపోయెను. అంతట నాసిద్ధుఁడు చిన్నవానిని లేపి “నాయనా ! నీ కచిరకాలములోనే మహైశ్వర్యపదవి లభించును; మహారాజభోగంబు లనుభవింతువు ; ఇట్లెన్నఁడు నొంటరిగ నరణ్యమునఁ బండుకొనకుము; శీఘ్రముగా నింటికి వెడలిపొమ్ము." అనిపలికి తనదారిని బట్టుకొని తాను వెడలిపోయెను. అప్పు డాబాలుఁడు తనలోఁ దానిట్లు వితర్కించుకొనియెను.

"నేను బాలుఁడను ; తల్లిదండ్రులు లేనివాఁడను; నాకు విద్య యెట్లు లభించును? నా కెవ్వరు దిక్కు? దేశములోఁ ద్రిమ్మరినై తిరుగుచున్న నన్నుఁ జేరఁదీయువా రెవ్వరు? నాకు