పుట:Thimmarusumantri.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమప్రకరణము

మఱునాఁడు తిమ్మరుసు ప్రయాణభేరి మ్రోగించెను. సేనాధిపతులందఱును తమతమ సైన్యములతోఁ బ్రయాణోన్ముఖులై యుండిరి. ఎచటఁ జూచినను భేరీమృదంగపణవాది తూర్యనినాదంబులు చెలంగుచు నింగి నిగిడెను. సైన్యాధిపతుల శంఖారావంబులును, ఏనుగుల ఘంటానాదంబులును బెల్లుగా మొఱసెను. వీరసైనికుల ఘంటలమ్రోత బెట్టిదంబయ్యెను. వందిమాగధుల కైవారంబులు మిన్ను ముట్టెను. రాజపురోహితులైన బ్రాహ్మణులు స్వస్తివాచకములు పఠించుచుండిరి. ఆమహానగరంబున నెక్కడ విన్నను నుత్సాహవాక్యములేగాని యన్యంబులు వినరావు. తల్లులు తమపుత్త్రులను, అక్క సెల్లెండ్రు తమ సోదరులను, భార్యలు తమభర్తలను తక్కుంగల స్త్రీలు తమబంధుసైనికులను రణోన్ముఖులను గావించి ప్రోత్సహించి వీరప్రవచనంబు లాడుచుండిరి.

దండయాత్ర వెడలుట

అట్లత్యుత్సాహముతో సైనికు లెల్లరు సమరోన్ముఖులై యుండ సకలసైన్యాధ్యక్షుఁడగు తిమ్మరుసుమంత్రీంద్రునిచే ననుజ్ఞాతులై ముఖ్యసేనాధిపతులు తమతమ సైన్యములతోడను, పరివారజనంబుతోడను, వస్తుసామగ్రితోడను ప్రాగ్దిశా ముఖంబున నొకరిని వెంబడించి యొకరు నడువ నారంభించిరి.