పుట:Thimmarusumantri.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమప్రకరణము

107


గోల్కొండసుల్తాను కూలీకుతుబ్షాహ రాచకొండ, దేవరకొండ, పానుగల్లు మొదలగు దుర్గముల నాక్రమించుకొని మనకు సామంతులై యున్న పద్మనాయకుల వెడలఁగొట్టి యున్నవాఁడు. తూర్పుప్రక్కను ప్రతాపరుద్రగజపతి విజృంభించి యుదయగిరి ప్రాంతమువఱకుఁ గలతెలుఁగుదేశము నాక్రమించుకొని యున్నవాఁడు. ప్రస్తుతము మన మిప్పుడు ప్రతాపరుద్రగజపతిపై దండయాత్ర వెడలి కృష్ణానది దిగువభాగమున నాతని ప్రభుత్వము లేకుండఁ జేసి తఱిమివేయ వలయును. కృష్ణానదీ సేతు మధ్యస్థమైన దేశమున కంతకు నేకచ్ఛత్రాధిపతినిగఁ జేసి యేలింపఁ బ్రతిజ్ఞ చేసితిని. ఇందువలన దక్షిణహిందూస్థానమున మనపూర్వులచే స్థాపింపఁబడిన హైందవసామ్రాజ్యము దృఢమై శాశ్వతముగా హైందవధర్మము చెక్కుచెదరకుండ స్థాపితమై దేశమున నాటుకొని యుండునటుల చేయవలయును. ఇది నాయొక్కనివలన నగు కార్యముకాదు. మీసహాయ్వమునఁ గాని మేమీ మహోద్యమమును నిర్వహింపఁజాలము. మీవంటి మహాయోధులు హైందవసామ్రాజ్య మలంకరించియుండ హైందవధర్మము వర్ధిల్లుననుటకు సందియమేమియునులేదు. మీసాహాయ్యంబునఁ బూర్వదిగ్విజయయాత్ర జయప్రదముగా నిర్వహింపఁబడునన్న విశ్వాసముతో మనయేలిక యున్నవాఁడు. మనయేలిక యభీష్టమునుదీర్చుట మనకెల్లరకు గర్తవ్వమని పలుమఱు నొక్కి వక్కాణింప నగత్యములేదు. భగవంతుఁడు మన యుద్యమమునకుఁ దోడ్పడి విజయమును బ్రసాదించును గాక."