పుట:Thimmarusumantri.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

తిమ్మరుసు మంత్రి


ప్రవహించు ఫలవంతమైన దేశమునకు, వేంకటప్పనాయకుఁడు కొడగు, మళయాళదేశములకు నధికారులుగా, నియమింపఁ బడిరి. ఇట్లు పూర్వకర్లాట ద్రవిడదేశమునంతయును వశముచేసి కొని మూఁడుకోట్ల ద్రవ్యమును భాండారమునకుఁ జేర్పించెను. దక్షిణదేశమున రాయనిఁ దిరస్కరించి కప్పములు చెల్లింపక యుద్ధములు చేయువారు లేకుండఁ జేసి తిమ్మరుసు తనప్రజ్ఞా విశేషమును లోకమునకు వెల్లడించెను.

తిమ్మరుసు పూర్వదిగ్విజయయాత్రకుఁ బ్రోత్సహించుట

ఒకనాఁడు రహస్యముగా రాయనికడకుఁ బోయి తిమ్మరుసు మంత్రి యిట్లు ప్రబోధించెను.

దేవా! నీయభీష్టమును దీర్చుకొనుకాల మాసన్నమైనది. నీపు రెండు సంవత్సరముల క్రితము శాత్రవులను జయించి శత్రుదుర్గముల నాక్రమింపవలయునన్న పెద్దికోరిక గలదని నాతో నుడివినప్పుడు సైన్యముల నాయత్తపఱుచుటకు రెండు సంవత్సరముల కాలము గడువడిగి యున్నాను. నేఁటితో గడువు కాలము ముగిసిపోయినది. ఇప్పుడు యుద్ధముచేయుటకు పది లక్షల సైన్యమును సిద్ధము గావించితిని. అవసరమైనయెడల మఱియొక పదిలక్షల సైన్యమును సమకూర్చుటకుం దగు నేర్పాటులను గావించితిని. కవచధారణము గలిగిన ముప్పదివేల యాశ్వికబలమును చేకూర్చితిని. ప్రశస్తమైన గజబలమును గలదు. కావలసినంత ద్రవ్యమును భాండారమునం జేర్పించితిని.